Tuesday, November 26, 2024

TG ప‌ది ఎక‌రాల లోపు రైతుల‌కు భ‌రోసా – శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

టీజీ, ఏపీ సీఎంలు క‌ల‌వ‌డాన్ని రాజ‌కీయం చేయొద్దు
విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై పంతాల‌కు పోకుండా ప‌రిష్క‌రించుకోవాలి
ఫిరాయింపుల‌పై గ‌త‌ చైర్మ‌న్‌ల‌ ప‌ద్ధ‌తినే పాటిస్తాన‌ని వెల్ల‌డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ , న‌ల్ల‌గొండ : పది ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో మీడియాతో ఆయ‌న‌ మాట్లాడారు. రైతు భరోసా, రుణమాఫీ అర్హులైన రైతులకు అందాలని సూచించారు . 2026 లో పునర్విభజన చట్టం అమలయ్యే అవకాశం ఉందని, ఈ చట్టం అమలు అయితే తెలంగాణలో 34, ఏపీలో 50 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో న్యాయబద్ధంగా తెలంగాణకు వాటా ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. తెలంగాణకు ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. చాలాకాలం పెండింగ్ లో ఉన్న సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కావడం శుభ పరిణామన్నారు.

- Advertisement -

పంతాల‌కు పోవ‌ద్దు..

విభజన సమస్యలపై పంతాలకు పోకుండా ఇరు రాష్ట్రాలు శాశ్వత పరిష్కారానికి మార్గం చూడాలని కోరారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కలవడాన్ని అభివృద్ధి కోణంలో చూడాలని, అందులో రాజకీయ కోణాన్ని వెతుకొద్దని సూచించారు. తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. వచ్చే రెండేళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తిచేస్తే జిల్లాలో సాగునీటి సమస్యలు తీరుతాయన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో ఉన్న శాసనమండలి చైర్మన్, స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తాను కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. శాసనమండలి రద్దు అవుతుందని వస్తున్న వార్తలను ఆయ‌న ఖండించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement