Friday, November 22, 2024

TG – ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-1 మెయిన్స్ ఎగ్జామ్స్

హైదరాబాద్‌: తెలంగాణలో వారం రోజుల పాటు జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అక్టోబరు 21 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఇవాళ సాయంత్రం 5గంటలతో పూర్తయ్యాయి..

మొత్తం 513 పోస్టులకు గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించగా.. వీరిలో అత్యధికులు పరీక్షలకు హాజరయ్యారు. స్పోర్ట్స్ కేటగిరిలో 20 మందిని అదనంగా పరీక్షలకు అనుమతించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్ ,రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ఈ నెల 21 నుంచి ప్రారంభమైన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగిశాయి.

అయితే గ్రూప్ 1 మెయిన్స్‌కు అర్హత సాధించిన వారిలో చాలా మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారు. దీంతో ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థుల సంఖ్య తగ్గింది.

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాజరు శాతం..

- Advertisement -

>> అక్టోబర్ 21న జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫయింగ్ టెస్ట్) పరీక్షకు 22,744 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాజరు శాతం 72.4గా ఉంది.

>> అక్టోబర్ 22న పేపర్ 1- జనరల్ ఎస్సే పరీక్షకు 21,817 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాజరు శాతం 69.4గా ఉంది.

>> అక్టోబర్ 23న పేపర్ 2- హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ పరీక్షకు 21,429 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాజరుశాతం 68.2గా ఉంది.

>> అక్టోబర్ 24న పేపర్ -3 ఇండియన్ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ పరీక్షకు 21,264 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాజరు శాతం 67.7గా నమోదైంది.

>> అక్టోబర్ 25న పేపర్ 4- ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్షకు 21,195 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాజరు శాతం 67.4గా నమోదైంది

.>> అక్టోబర్ 26న పేపర్ 5- సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్ పరీక్షకు 21,181 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాజరు శాతం 67.4గా ఉంది.

ఇక ఈ నెల 25న నిర్వహించిన పేపర్ 4- ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్షలో ఓ మహిళా అభ్యర్థి కాపీయింగ్‌కు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు వచ్చిన మహబూబ్‌నగర్‌ జిల్లా ఖానాపూర్‌కు చెందిన లక్ష్మి చిట్టీలు తీసుకుని వచ్చి కాపీయింగ్‌కు పాల్పడేందుకు యత్నించింది. ఇది గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను డిబార్ చేస్తున్నట్టుగా టీజీపీఎస్సీ ప్రకటించింది.

26న పేపర్ -5 రోజున కూడా మరో అభ్యర్థి కాపీయింగ్‌కు పాల్పడేందుకు యత్నించాడు. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని తనిఖీ చేయగా అతని వద్ద చిట్టీలు కనిపించాయి. దీంతో అతడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని టీజీపీఎస్సీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement