Friday, November 22, 2024

TG – ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై 3 నుంచి క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న – రేవంత్ రెడ్డి

  • రాష్ట్రవ్యాప్తంగా 238 ప్రాంతాల్లో అయిదు రోజుల పాటు సాగ‌నున్న ప్ర‌క్రియ‌
  • ప‌ట్ట‌ణ/న‌గ‌ర ప్రాంతాల్లో జ‌నాభా ఆధారంగా ఎక్కువ టీమ్‌లు
  • ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
  • కుటుంబ ఫొటో దిగ‌డం ఆప్ష‌న్ మాత్ర‌మే…

హైద‌రాబాద్‌: తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ జారీకి సంబంధించి 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయిలో పైలెట్ ప్రాజెక్టుగా చేప‌ట్ట‌నున్న ప్ర‌క్రియ‌ను స‌మ‌ర్థంగా చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఒక ప‌ట్ట‌ణ‌, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాల‌ని సూచించారు. ఒక వేళ పూర్తిగా ప‌ట్ట‌ణ/న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గ‌మైతే రెండు వార్డులు/ డివిజ‌న్లు, పూర్తిగా గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గ‌మైతే రెండు గ్రామాల్లో మొత్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. వార్డులు/ డివిజ‌న్ల‌లో జ‌నాభా ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉన్నందున ప‌రిశీల‌న బృందాల సంఖ్య‌ను పెంచుకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర స‌చివాల‌యంలో సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఫ్యామిలీ డిజిట్ కార్డుల పైలెట్ ప్రాజెక్టు, సేక‌రించే వివ‌రాల‌ను అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌ చేప‌ట్ట‌నున్న గ్రామాలు, వార్డులు/ డివిజ‌న్ల ఎంపిక పూర్త‌యింద‌ని అధికారులు సీఎంకు వివ‌రించారు. పైలెట్ ప్రాజెక్టును ఎన్ని రోజుల పాటు చేప‌డ‌తార‌ని సీఎం ప్ర‌శ్నించారు. అక్టోబ‌రు మూడో తేదీ నుంచి ఏడో తేదీ వ‌ర‌కు అయిదు రోజుల పాటు చేప‌డ‌తామ‌ని అధికారులు తెలిపారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యులు అంతా స‌మ్మ‌తిస్తే కుటుంబం ఫొటో తీయాల‌ని, అదో అప్ష‌న‌ల్ గా ఉండాల‌ని, కుటుంబం స‌మ్మ‌తి లేకుంటే ఆ ఫొటో తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌కు సంబంధించి ఉమ్మ‌డి జిల్లాల‌కు ఉన్న నోడ‌ల్ అధికారులు క‌లెక్ట‌ర్ల‌కు మార్గ‌నిర్దేశం చేయాల‌ని.. అప్పుడే ప‌క‌డ్బందీగా కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని ముఖ్య‌మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు.


ప్ర‌భుత్వం వ‌ద్దనున్న రేష‌న్ కార్డు, పింఛ‌ను-స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతు భ‌రోసా, రుణ‌మాఫీ, బీమా, ఆరోగ్య శ్రీ‌, కంటి వెలుగు త‌దిత‌ర డేటాల ఆధారంగా ఇప్ప‌టికే కుటుంబాల‌ గుర్తింపున‌కు సంబంధించిన ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని, పైలెట్ ప్రాజెక్టులో దానిని నిర్ధారించుకోవ‌డంతో పాటు కొత్త స‌భ్యులను జ‌త చేయ‌డం, మృతి చెందిన వారిని తొల‌గించ‌డం చేస్తామ‌ని అధికారులు వివ‌రించారు. కుటుంబ స‌భ్యుల వివ‌రాల న‌మోదు, మార్పులుచేర్పుల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఎటువంటి పొర‌పాట్ల‌కు తావివ్వ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు.

పైలెట్ ప్రాజెక్టుతో బ‌య‌ట‌కు వ‌చ్చిన సానుకూల‌త‌లు, ఎదురైన ఇబ్బందుల‌తో నివేదిక త‌యారు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆ నివేదిక‌పై చ‌ర్చించి లోపాల‌ను ప‌రిహారించిన అనంత‌ర పూర్తి స్థాయి క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ చేప‌డ‌దామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. స‌మీక్ష‌లో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ‌, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శేషాద్రి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శులు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శులు సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, మాణిక్ రాజ్‌, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement