Wednesday, December 18, 2024

TG – పిల్ల‌ల‌పై శ్ర‌ద్ద ఏదీ? కలవర పెట్టిస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు ..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఆదిలాబాద్ బ్యూరో : ఇటీవ‌ల జ‌రుగుతున్న‌వ‌రుస సంఘ‌ట‌న‌ల‌తో ఆశ్ర‌మ పాఠ‌శాల‌లు అంటే విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 132 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 40,427 ఉంది చిన్నారులు ఉన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్ర‌భుత్వ గిరిజ‌న ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో ఎక్క‌డో ఓ చోట క‌లుషిత ఆహారం సంఘ‌ట‌న‌లు జ‌రుగుతునే ఉన్నాయి. వసతి గృహాల్లో మెనూ పాటించ‌క‌పోవ‌డం, నాణ్య‌త కొర‌వ‌డ‌డం ఒక స‌మ‌స్య అయితే. విద్యార్థుల సంఖ్య‌కు అనుగుణంగా మ‌రుగుదొడ్లు, మూత్ర‌శాల‌లు లేక‌పోవ‌డం, అలాగే శుభ్రం చేయ‌క‌పోవం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు వెంటాడుతునే ఉన్నాయి.

చిన్నారుల ఆరోగ్యంపై క‌ల‌వ‌రం
విద్యార్థుల‌ ఆలనా పాలన చూడాల్సిన అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ప్ర‌ధాన కార‌ణం. ఈ కార‌ణంగా హాస్ట‌ళ్ల‌లో తినాలంటే విద్యార్థులు భ‌య‌ప‌డుతున్నారు. కొమ్ర‌రాంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి ప్ర‌భుత్వ‌ గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజనం వికటించి వాంతులు విరేచనాలతో 64 మంది బాలికలు ఆస్ప‌త్రిపాల‌య్యారు. ఇందులో 15 మంది విద్యార్థినులు వాంకిడిలో, నలుగురు ఆసిఫాబాద్ లో, ముగ్గురు హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. విద్యార్థినుల‌ను నిమ్స్‌లో చేర్పించారంటే ప‌రిస్థితి ఊహించుకోవ‌చ్చు. వీరిలో శైలజ అనే చిన్నారి ఆరోగ్య పరిస్థితి మ‌రింత‌ విషమించినట్టు తెలుస్తోంది. ఆ బాలికకు వెంటిలేటర్ పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయినా ఇంత‌వ‌ర‌కు ఈ ఘ‌ట‌న‌కు బాధ్యుల‌ను గుర్తించి చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డంపై ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.

వాంకిడి ఘటనపై స్పందించ‌ని ప్ర‌భుత్వం
వాంకిడి గిరిజ‌న ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో జ‌రిగిన సంఘ‌ట‌పై ఇంత‌వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. బుధ‌వారం జ‌రిగిన మంచిర్యాల ఘ‌ట‌న‌పై స్పందించిన ప్ర‌భుత్వం.. వాంకిడి ఘ‌ట‌న‌పై ఎందుకు స్పందించ‌లేద‌ని ప‌లువురు ప్ర‌శ్నించారు.

మంచిర్యాల ఘటనపై ఇద్దరి సస్పెన్షన్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయి కుంట గిరిజన బాలికల వసతి గృహంలో క‌లుషిత ఆహారం సంఘ‌ట‌న‌కు సంబంధించి డీటీడీఓ మ‌డావి గంగారాం, హాస్ట‌ల్ వార్డెన్ మాధ‌వ్‌ను క‌లెక్ట‌ర్ దీప‌క్ స‌స్పెండ్ చేశారు. ఈ సంఘ‌ట‌న‌పై క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌లుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే. పిల్లల ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోకపోవడం పట్ల కలెక్టర్ దీపక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

మ‌రో ముగ్గురికి హైద‌రాబాద్ త‌ర‌లింపు
వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన చిన్నారులను జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి మంచిర్యాల ఆసుపత్రిలో పరామర్శించారు. వీరిలో ముగ్గురు బాలికల ఆరోగ్య పరిస్థితి ఇంకా నయం కాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు గురువారం తరలించారు. మిగిలిన విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని, క్రమంగా కోలుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

ప‌ది రోజుల్లో ఇద్దరు చిన్నారుల మృతి
నిర్మల్, వాంకిడి, మంచిర్యాల వసతి గృహాల్లో వరుసగా నాలుగు రోజుల్లోనే ఫుడ్ పాయిజనింగ్ జరిగి 92 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. పది రోజుల కిందట ఇంద్రవెల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆదివాసీ బాలిక తీవ్ర జ్వరంతో మృతి చెందింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం నిర్మల్ లోని మహాత్మ జ్యోతిబా పూలే ఆశ్రమ పాఠశాలలో షేక్ అయాన్ (12) అనే విద్యార్థి మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement