హైదరాబాద్ – గత ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. జీఎస్టీ చెల్లింపుల్లో రూ.46 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే దీనిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈడీ కూడా దీనిపై కేసు నమోదు చేసింది.
మాజీ సీఎస్ నేతృత్వంలో జీఎస్టీ స్కామ్ జరిగినట్టు నిర్ధారించిన ఈడీ అనర్హులకు జీఎస్టీ రీపేమెంట్ చేసినట్లు గుర్తించింది. కేసు వివరాలలోకి వెళితే తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సోమేశ్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో జీఎస్‌టీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల లావాదేవీల్లో దాదాపు రూ.46 కోట్ల స్కాం చేశారని ఆరోపణలొచ్చాయి. ఓ సంస్థ, ముగ్గురు వ్యక్తులతో కలిసి ఈ స్కాం చేసినట్లు ప్రధాన ఆరోపణ. దీనిపై హైదరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ కె. రవికుమార్ పోలీసు డిటెక్టివ్ విభాగానికి ఫిర్యాదు చేయగా.. ఆ ఫిర్యాదు మేరకు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఎ. శివ రామ ప్రసాద్‌పై కూడా కేసు నమోదు చేశారు.