హైదరాబాద్ – అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ఛైర్మన్ , నిర్మాత దిల్ రాజు కోరారు. మీ రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని హితవు పలికారు. ఇటివల చిత్ర పరిశ్రమ సమావేశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల స్పందిస్తూ, ఆయన చాలా బాధాకరం అని అన్నారు.
ఈ మేరకు ఎఫ్ డి సి చైర్మన్ హోదాలో ఆయన ఒక లేఖ విడుదల చేశారు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కాంక్షించారని దిల్ రాజు అన్నారు.
హైదరాబాదును గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చదిద్దాలనే సీఎం రేవంత్ బలమైన సంకల్పాన్ని, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగిందని అన్నారు.లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని దిల్ రాజు అన్నారు.