Thursday, November 21, 2024

TG – సింగరేణి కార్మికులు ఫుల్ జోష్ ….దీపావ‌ళి బోన‌స్ నిధులు విడుద‌ల

బోనస్ కింద రూ.358 కోట్లు విడుదల
గత ఏడాది కన్నా ఇది రూ. 50 కోట్లు అధికం
ఒక్కొక్క కార్మికునికి రూ.93,750 బోన‌స్ చెల్లింపు
రేప‌టి లోగా కార్మికుల ఖాతాల్లో బోనస్ జమ
రాష్ట్ర ఉపముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు

హైద‌రాబాద్ – దీపావళి బోనస్ గా పిలవబడే పి.ఎల్.ఆర్.ఎస్. (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కీమ్) బోనస్ ను నేటి నుంచి సింగరేణి కార్మికులకు చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్య‌మంత్రి వ‌ర్యులు మ‌రియు ఇంధ‌న శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు గురువారం స‌చివాల‌యంలో ప్రకటించారు.

- Advertisement -

దీని కోసం సింగరేణి సంస్థ 358 కోట్ల రూపాయలను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ ను ఆదేశించారు. రాష్ట్ర స‌చివాల‌యంలో సింగ‌రేణిపై స‌మీక్ష సంద‌ర్భంగా ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది చెల్లించిన దీపావళి బోనస్ కన్నా ఇది రూ.50 కోట్లు అధికం కావ‌డం విశేషం. రేప‌టి మ‌ధ్యాహ్నం నాటికి దీపావళి బోనస్ ను కార్మికుల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు స్ప‌ష్టం చేశారు. దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికుడు రూ.93,750 లు అందుకోనున్నారు.

దీపావళి బోనస్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 40,000 మంది కార్మికులకు వర్తిస్తుంది. జే.బీ.సీ.సీ.ఐ. విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్ ను చెల్లించే పద్ధతి గత కొన్నేళ్లుగా అమలులో ఉంటోంది. ఈ ఏడాది కూడా కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే చెల్లింపులు జరిగేలా భ‌ట్టి ఆదేశాలిచ్చారు.

బోనస్ తో కలిపి కార్మికులకు దాదాపు రూ.1250 కోట్ల చెల్లింపులు

కాగా ఇటీవలే సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద 796 కోట్ల రూపాయలను కంపెనీ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఒక్కొక్క కార్మికుడికి సగటున 1 లక్షా 90 వేల రూపాయలు అందాయి. అలాగే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.5 వేల చొప్పున చెల్లించారు. అలాగే పండుగ అడ్వాన్స్ కింద ఒక్కొక్క కార్మికునికి 25వేల రూపాయలు చొప్పున మరో 90 కోట్ల రూపాయలను కంపెనీ చెల్లించింది. ఇప్పుడు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి సగటున రూ.93,450లు లభిస్తాయి. మొత్త‌మ్మీద ఈ నెల రోజుల వ్య‌వ‌ధిలో దీపావ‌ళి బోన‌స్‌, లాభాల వాటా, పండుగ అడ్వాన్స్ కింద రూ.1250 కోట్ల ను కంపెనీ చెల్లించింది. ఈ విధంగా సగటున సింగరేణి ఉద్యోగులు ఈ నెల రోజుల కాలంలో ఒక్కొక్కరు సుమారు మూడు లక్షల రూపాయల వరకు అందుకున్నారు.


రాష్ట్ర ఉపముఖ్య‌మంత్రి ఆదేశాలపై సింగరేణి సంస్థ సీఎండీ బలరామ్ బోనస్ చెల్లింపుపై తగు ఏర్పాటు చేయాలని ఆయన పర్సనల్ మరియు ఫైనాన్స్ విభాగం అధికారులను ఆదేశించారు. ఈ బోనస్ డబ్బులను దుబారా చేయవద్దని, ప్రభుత్వ పొదుపు సంస్థల్లో దాచుకోవాలని లేదా కుటుంబ అవసరాలకు అనుగుణంగా జాగ్ర‌త్త‌గా వెచ్చించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement