Monday, September 16, 2024

TG – రాష్ట్రంలోడెకాయిట్ల పాల‌న – జ‌గ‌దీష్ రెడ్డి

న‌ల్గొండ – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని అనడం చేతకాని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నేడు బిఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌పై పడి ఏడుస్తున్నారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి.. డబ్బులతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారు మీవాళ్లయితే, కేసీఆర్ పదేళ్లు ప్రజాసంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి అన్నారు. నేడు ఆయన న‌ల్గొండ‌లో మీడియాతో మాట్లాడుతూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భాషను మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. మీకంటే వెనుక వచ్చినవాడు మీకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి పదవి గుంజుకుంటే చూస్తూ ఊరుకున్న చేతకాని దద్దమ్మగా ఉత్తమ్ ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రేవంత్‌కు పడ్డ చివాట్లు మీకు తప్పవని ఉత్తమ్‌ను హెచ్చరించారు. ఆయన ఇలాగే తిడుతుంటే చీవాట్లు పడతాయని, కానీ ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరన్నారు. రాష్ట్రంలో డెకాయిట్ల పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా అధికార పార్టీ వారి కమీషన్లు, దోపిడీ గురించే ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. తమ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా నీటిని, విద్యుత్‌ను అందించామన్నారు. కానీ ఇప్పుడు నీటి కోసం, విద్యుత్ కోసం ధర్నాలు జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

సాగునీటి కోసం ధర్నాలు కొనసాగితే యాసంగి నాటికి కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. బాధ్యతలు చేతకాకుంటే మంత్రి పదవిపై ఆయన పునరాలోచన చేయాలన్నారు. కాళేశ్వరం నుంచి నీటిని అందించకుంటే కాంగ్రెస్ వారికి రైతులతో దెబ్బలు తప్పవన్నారు. రైతుల సమస్యలపై కేసీఆర్ త్వరలో కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement