హైదరాబాద్ : హెల్త్ పాలసీపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రిలో నూతన ఎంఆర్ఐ, మెడికల్ ఓపీ, రెనోవేటేడ్ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందేవిధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ ఆస్పత్రికి తాను రావడం ఇదే మొదటిసారి అన్నారు.
మెరుగైన వైద్యం అందించాలనే తపన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. వైద్య చికిత్స అందించే ప్రొసీజర్స్ పెంచామని, చికిత్స అందించే విషయంలో ధరలను కూడా సవరించామని తెలిపారు. క్యాన్సర్, ట్రామా కేర్ గురించి సమీక్ష చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే నర్సింగ్ విద్యార్థులకు హాస్టల్ భవనాలు నిర్మిస్తామన్నారు.