అధికారులు వస్తుంటారు పోతుంటారు
నేను ఇక్కడే శాశ్వతంగా ఉంటా
ఆ ఘటనపై సీఎంకు ఫిర్యాదు చేస్తా
ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – హిమాయత్ నగర్ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. అధికారులు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు.. కానీ తాను ఇక్కడ లోకల్ అని, ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లుంది, అందుకే తనపై కేసు పెట్టారని అన్నారు. జరిగిన విషయాన్ని ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.
ప్రివిలేజీషన్ నోటీసులు ఇస్తా…
హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి, అన్నివర్గాల ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, సమస్యలు పరిష్కరించం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎమ్మెల్యే దానం అన్నారు. నందగిరి హిల్స్ హుడా లే ఔట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజీషన్ నోటీసులు ఇస్తానని, ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
ప్రజాప్రతినిధి ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది…
ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, నన్ను అడ్డుకొని అధికారం ఎవరికీ లేదని దానం నాగేందర్ అన్నారు. గతంలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎదురించినందుకు తనపై కేసులు పెట్టారని, ఇప్పుడు తనకు కేసులు కొత్తేమికాదని చెప్పారు.