పరిశీలించిన శివరాజ్ సింగ్ చౌహన్, బండి సంజయ్
వారి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల
రైతుల నుంచి పంట నష్టం వివరాల సేకరణ
వరద సహాయంపై అన్నదాతల నుంచి ఆరా
వరద తీవ్రతపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ వీక్షణ
మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్‌తో శివరాజ్ సింగ్ చౌహాన్ భేటీ
వరదలపై ఉన్నతాదికారులతో సచివాలయంలో సమీక్ష
ఆంధ్రప్రభ స్మార్ట్, ఖమ్మం : భారీ వర్షాలు.. వరదలతో అతలాకుతలం అయిన ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని శుక్రవారం కేంద్ర మంత్రుల బృందం పరిశీలించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజయవాడకు హెలికాప్టర్‌లో వెళ్లి అక్కడి నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి వరద నష్టంపై ఖమ్మంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. మధిర, ఖమ్మంలో ఏరియల్ సర్వే ద్వారా వరద నష్టాలను పరిశీలించారు. అనంతరం పాలేరు చేరుకున్నారు.
భారీ వర్షం.. టెంట్లు, ఫొటో ఎగ్జిబిషన్‌కు అంతరాయం
కాగా, శుక్రవారం మధ్యాహ్నం మరోసారి భారీ వర్షం రావడంతో పాలేరు ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన టెంట్లు, ఫొటో ఎగ్జిబిషన్ కూలిపోయాయి. దీంతో అధికారులు పాలేరు నవోదయ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. అక్కడి వెళ్లిన కేంద్ర మంత్రులు ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.. పాలేరులో వరదల వల్ల నష్టపోయిన రైతులతో మాట్లాడారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతుల నుంచి పంట నష్ట వివరాలు, అందుతున్న సాయం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.. అలాగే మంత్రులు పొంగులేటి, తుమ్మల సైతం వరద ముంపు తీవ్రతను శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వివరించారు.
సీఎం రేవంత్‌తో భేటీ కానున్న కేంద్ర మంత్రి
సర్వే అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ బృందం మోతె హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్‌కు బయలు దేరారు. బేగంపేటలో నుంచి నేరుగా రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్నారు. సచివాలయంలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ఇక.. వరద నష్టంపై కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్.. సీఎం రేవంత్‌తో కలిసి తొలిసారి మీటింగ్‌లో పాల్గొననున్నారు.