తిమ్మాపూర్ ఆంధ్ర ప్రభ కాలువకు గండిపడడంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామం జలదిగ్బంధమైంది. సిద్దిపేట జిల్లా తోటపల్లి రిజర్వాయర్ నుండి తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపేందుకు డి 4 కాలువ ద్వారా నీటిని తరలిస్తుండగా కాలువకు గండి పడడంతో మన్నెంపల్లి గ్రామంలోని కాలనీలు జలదిగ్బంధమయ్యాయి.
అర్ధరాత్రి తర్వాత గ్రామంలోకి పెద్ద ఎత్తున నీరు రావడంతో ఎస్సీ కాలనీ ప్రజలు జాగారం చేసారు. గండి పడటంతో ఊరంతా వాగై పారుతుంది .ఇళ్లలోకి నీరు నిండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . గ్రామంలో ఇలా జరగడం నాలుగో సారని, ఇంత జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
ఇండ్లలోకి నీరు చేరడంతో సరుకులు, బియ్యం తో పాటు వస్తువులన్నీ నీటిలో మునిగిపోయాయని వాపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంటున్నామని గ్రామస్తులు తెలిపారు. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, వెంటనే మరమ్మత్తులు చేయించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.