Sunday, November 17, 2024

TG విద్యుత్ చార్జీల పెంపును వ్య‌తిరేకించిన బిఆర్ఎస్ …

హైద‌రాబాద్ – విద్యుత్ ట్రూ అప్ చార్జీల‌ని పెంచాల‌ని ఆ శాఖ నిర్ణ‌యాన్ని బిఆర్ ఎస్ పార్టీ వ్య‌తిరేకించింది.. విద్యుత్ చార్జీల‌ను పెంచ‌వ‌ద్ద‌ని విద్యుత్‌ నియంత్రణ భవన్‌లో ఎలక్ట్రిసిటి రెగ్యులేటరి కమిషన్ (ఈఆర్సీ) బహిరంగ విచారణ సందర్భంగా హాజరై వాదనలు వినిపించిన శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి కోరారు…


విచార‌ణ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… – రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారే అవకాశం ఉన్న విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించాలని ఈఆర్సీను విజ్ఞప్తి చేశానన్నారు.

రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రజలు కరెంటు విషయంలో పడరాని అగచాట్లు పడ్డారని, 2014 లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసిఆర్ దార్శనికతతో విద్యుత్ రంగాన్ని వేల కోట్లతో తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారని అన్నారు. 7 వేల మెగా వాట్ల నుండి 24 వేల మెగావాట్ల సామర్థ్యం వైపు తెలంగాణను తీసుకెళ్లారని అన్నారు. ట్రాన్స్ మిషన్ లైన్లను బలోపేతం చేశారని, లెక్కకు మిక్కిలి సబ్ స్టేషన్ లు , ట్రాన్స్ ఫార్మర్ లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వ్యవసానికి ఉచిత, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించార‌న్నారు. వ్యవసాయ ఉత్పత్తులను అనేక రెట్లు పెంచారని, పారిశ్రామిక రంగానికి నిరంతరాయ విద్యుత్ అందించారని, ఇలా విద్యుత్ రంగంలో తెలంగాణ స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించిందని వెల్లడించారు.

విద్యుత్ చార్జీలు పెంచకుండా రాష్ట్ర సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగేందుకు గత కేసిఆర్ ప్రభుత్వం కృషి చేసింద‌న్నారు. అందుకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం డిస్కంలతో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకు పంపించి రాష్ట్ర విస్తృత ప్రయోజనాలకు దెబ్బతీయ చూస్తున్నద‌ని ఆరోపించారు. విద్యుత్ చార్జీలు పెంచడం అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలందరి ఆదాయానికి గండి కొట్టడమేని మ‌ధుసూధ‌నాచారి అన్నారు..

- Advertisement -

ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలపై చిత్త శుద్ధి ఉంటే డిస్కంలు ప్రతిపాదించిన ధరల పెంపు భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపేణా భరించాలని డిమాండ్ చేశారు. ఈ విచార‌ణ‌లో ఎమ్మెల్సీ శ్రీ మహామూద్ ఆలీ, సురభి వాణి దేవి , తక్కెళ్ళపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement