Sunday, November 17, 2024

TG – కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ ఎల్పీ విలీనం త‌ధ్యం – ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ జోస్యం

ఈ రోజు ఒక‌రు, రేపు మ‌రొక‌రు…
మ‌రో వారంలో మ‌రో నలుగురు హ‌స్తం గూటికి
కారు పార్టీలో కేవ‌లం ఉండేది కేవ‌లం న‌లుగురు
భ‌విష్య‌త్ అంతా కాంగ్రెస్ దే..
తెలంగాణ లో కేసీఆర్ పార్టీ ఖేల్ ఖ‌తం.. దుకాణం బంద్

అంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ ప్రతినిధి – అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని.. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ (బీఆర్ఎస్ లెజిస్లేటివ్) పార్టీ.. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. హైదరాబాద్ సిటీలో నేడు జ‌రిగిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీలో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా మాత్రమే ఉంటారని.. మిగతా ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని స్పష్టం చేశారాయన.

కేసీఆర్ చేసిన‌వ‌న్నీ తప్పులే…

- Advertisement -

ఇదే సందర్భంలో కేసీఆర్ వ్యవహార శైలినీ తప్పుబట్టారు దానం. కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని.. ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండరని.. ఎప్పుడూ ఫాంహౌస్ లోనే ఉంటారంటూ చురకలు అంటించారు దానం. ఒకవేళ అపాయింట్ మెంట్ ఇచ్చినా.. గంటల తరబడి కేసీఆర్ కోసం వెయిట్ చేయాలని.. బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛలేదన్నారు దానం.

కేటీఆర్ అనుచ‌రులు మొత్తం దోచేశారు…

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. కేటీఆర్, అతని అనుచరులు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని.. ఆ వివరాలు అన్నీ బయట పెడతానని వెల్లడించారాయన. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామంటూ కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని.. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు దానం.

జైల్లో ఉన్న కవితను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారని.. కావాలనే కవితను జైల్లోనే ఉంచుతున్నారంటూ కేసీఆర్, కేటీఆర్ తీరును ప్రశ్నించారు దానం. అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ మూతపడుతుందని అది ఎంతో దూరంలో లేదని జోస్యం చెప్పారు దానం.

Advertisement

తాజా వార్తలు

Advertisement