విద్యుత్ రంగ చర్చలో జగదీష్, మంత్రి కోమటిరెడ్డి మధ్య ఫైట్
ఒకరిపై ఒకరు విమర్శల వర్షం
సభలో వ్యక్తిగత విషయాలు
కాంగ్రెస్ చలువతోనే తెలంగాణకు 24 గంటల విద్యుత్
కెసిఆర్ సారధ్యంలోనే ఆ ఘనత
విద్యుత్ కొనగోళ్లలో కేసిఆర్ చేతివాటం
విద్యుత్ మంత్రికి హస్తం
నిరూపిస్తే రాజకీయాలకు దూరం అన్న జగదీష్
ముందుంది ముసళ్ల పండగన్నమంత్రి
అంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్: విద్యుత్ రంగ చర్చలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో జరిగింది.. అసలు కంటే వ్యక్తిగత విషయాలపైనే ఇద్దరు ఫోకస్ చేసుకున్నారు.. అసెంబ్లీలో విద్యుత్ పైచర్చ సందర్భంగా ఈ మధ్య మాటల తూటాలు పేలాయి. సవాళ్లు ,ప్రతిసవాళ్లు విసురుకున్నారు.
జగదీష్ రెడ్డిపై కోమటరెడ్డి విరుచుకుపడ్డారు. జగదీష్ రెడ్డికి నల్గొండలో క్రిమినల్ రికార్డ్ ఉందని ఆరోపించారు. జగదీష్ రెడ్డిపై ఆరోపణలు నిరూపించకపోతే తన ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కోమటిరెడ్డి. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు జగదీష్ రెడ్డి. కోమటి రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నానని చెప్పారు జగదీష్ రెడ్డి.
అసెంబ్లీలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు
జగదీశ్ రెడ్డి జీవితమంతా కిరాయి హత్యలు, దొంగతనాలు అంటూ మండిపడ్డారు మంత్రి. జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగారన్నారు. జగదీశ్ రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపిస్తానని సవాల్ చేశారు. ఆరోపణలు నిరూపించకుంటే ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నిండు సభలో మంత్రి ప్రకటించారు. సూర్యపేట రైస్ మిల్లులో జగదీష్ రెడ్డి దొంగతనం చేశారంటూ ఆరోపణలు గుప్పించారు.. రాంరెడ్డి హత్యకేసులో ఏ6 , ఓ హత్యకేసులో ఏ2 నిందితుడు జగదీశ్ రెడ్డి అంటూ చిట్టా విప్పారు.
నల్గొండలో జగదీష్ రెడ్డికి క్రిమినల్ రికార్డ్ ఉండంటంతో మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారన్నారు మంత్రి.
నిరూపించు.. రాజీనామా చేస్తా… జగదీష్ రెడ్డి
కాగా జగదీశ్ రెడ్డి సీఎం, మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. తాను హత్య కేసుల్లో నిందితుడినని నిరూపిస్తే ఇదే సభలో ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.రేవంత్ రెడ్డి ఎందుకు జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నారో.. మళ్లీ అక్కడికే వెళ్లాలని అనుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. తనకు కూడా చంచల్‌గూడ జైలు జీవితం గుర్తుందని అంటూ . తెలంగాణ ఉద్యమం కోసం జైలుకు పోయానన్నారు. ఆయనకు చర్లపల్లినే గుర్తు ఉంటది మళ్లీ యాది చేసుకంటున్నారని అన్నారు. సీఎం రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనపై ఆరోపణల చేసిన ప్రతి అక్షరం రికార్డుల నుంచి తొలగించాలి అని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాను చాలెంజ్ వేస్తున్నా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక్కటి నిరూపించినా.. అందులో ఒక్కటి రికార్డు చూయించినా నేను ఈ సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి పోతా.. రాజకీయాల్లో నుంచి వెళ్లిపోతా..! తప్పని నిరూపించకపోతే కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి.. పదవులకు రాజీనామా చేయాలి. తాను తన చాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నానని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
హౌజ్ కమిటీ వేయండి.. నిగ్గు తేలుతుంది..
తాను ఎక్కడా తప్పు మాట్లాడలేదన్నారు జగదీష్ రెడ్డి. ఉపేక్షించం అని శాసనసభ వ్యవహారాల మంత్రి భయపెట్టిస్తున్నారు. ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టారు తనపై అని పేర్కొన్నారు. ఈ మూడింటింలో కోర్టు నిర్దోషిగా తేల్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం కేసులు తప్ప.. వేరే కేసులు లేనే లేవని తేల్చి చెప్పారు. ఒక్క కేసు నా మీద ఉన్న పెట్రోల్ బంక్ దొంగతనం కేసు అని అన్నారు. మిర్యాలగూడ కేసు మీద హౌస్ కమిటీ వేయండి.. ఒక్కటి నిర్ధారణ కాకపోయినా.. ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తాను. సీఎం, మంత్రి కూడా ముక్కునేలకు రాసి రాజీనామా చేయాలి అని జగదీవ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆయనకు ప్రతిపక్ష హోద వేస్ట్ – రాజగోపాల్ రెడ్డి
రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,. అప్పుల నుంచి విద్యుత్ రంగాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సీఎంపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు సరికాదన్నారు. సభకు రాని కెసిఆర్ కు విపక్ష హోదా వేస్ట్ అంటూ వ్యాఖ్యానించారు.
”గత ప్రభుత్వ తప్పులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అదనపు విద్యుత్‌ను యూపీఏ ప్రభుత్వం కేటాయించింది. జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్ కేటాయించారు. కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం. కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదని అడిగితే.. కేసీఆర్‌తో మాట్లాడే స్థాయి మాది కాదన్నారు. సభకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్ కాకుండా వేరేవారు తీసుకోవచ్చు కదా? విద్యుత్ అవకతవకలపై కమిషన్ వేసి దర్యాప్తు చేస్తున్నాం. యాదాద్రి పవర్ ప్లాంట్ లాభదాయకం కాదని 2018లోనే చెప్పాను. ఈ ప్లాంట్ పూర్తయ్యేందుకు అదనంగా రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. డబ్బులు పోయినా యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తికాలేదు. రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉంది. అక్కడ కాకుండా యాదాద్రిలో ఎందుకు నిర్మించారు?” అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు.