Saturday, June 29, 2024

TG – నిమ్స్ హాస్పిట‌ల్లో ఈశ్వ‌ర‌మ్మ‌కు ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి ప‌రామ‌ర్శ ..

అమెపై లైంగిక దాడి అమాన‌వీయం అంటూ వ్యాఖ్య‌
నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఈశ్వ‌ర‌మ్మ
ప్ర‌భుత్వం అన్ని విధాల అదుకుంటుంద‌ని భ‌రోసా ..

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. హైద‌రాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలు ఈశ్వరమ్మను కుటుంబ సభ్యులను నేటి ఉద‌యం పరామర్శించిన అనంతరం ఆయన మంత్రి జూపల్లితో కలిసి మీడియాతో మాట్లాడారు.
మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు తలదించుకునే ఘటన ఇది అని పేర్కొన్నారు. యావత్ సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అంశం ఇది అన్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితురాలను నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని, మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి సైతం తరలించారని వివరించారు. ఘటన విషయాన్ని మంత్రి జూపల్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈశ్వరమ్మ తిరిగి పూర్తిగా ఆరోగ్యంతో కోలుకునే వరకు ఉచితంగా ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

- Advertisement -

ఇల్లు లేని పక్షంలో ఇందిరమ్మ ఇల్లు, ఇద్దరు పిల్లలను ఆశ్రమ పాఠశాలలో వారు ఎంతవరకు చదువుకుంటాం అంటే అంతవరకు చదివిస్తామని తెలిపారు. సాగుకు వ్యవసాయ భూమి కేటాయించడం వంటి అన్ని చర్యలు ప్రభుత్వపరంగా చేపడతామన్నారు. ఈశ్వరమ్మ ఘటనలో సమీప బంధువులైన బావ, అక్క తోబాటు బయట ఒకరు ఇద్దరు ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు. నిందితులను ఇప్పటికే రిమాండ్ కు తరలించారని, ఈ ఘటనలో పూర్తి సమాచారం సేకరించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించినట్టు తెలిపారు. మీడియా సమావేశానికి ముందు ఆసుపత్రిలో ఈశ్వరమ్మ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని, పూర్తి ఆరోగ్యంగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని వైద్య అధికారులను కోరారు.

మన్ననూర్ ద‌ర్గాలో భ‌ట్టి ప్రార్ధ‌న‌లు

ఇక నేటి ఉద‌యం శ్రీశైలం పర్యటనకు బ‌య‌లుదేరిన భట్టి విక్రమార్క అచ్చంపేట నియోజకవర్గం మన్ననూర్ ప్రాంతం వద్ద దర్గా వద్ద ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అలాగే మన్ననూర్ లింగమయ్య స్వామి గుడి వద్ద కూడా పూజలు నిర్వహించారు . వారితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు , అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే లు వంశీ కృష్ణ, కసిరెడ్డి నారాయణ, మేఘారెడ్డి, రాజేష్ రెడ్డి ఉన్నారు.

మ‌ల్ల‌న్న ద‌ర్శ‌న అనంత‌రం…

ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ముందుగా శ్రీశైలం మ‌ల‌న్న‌ను ద‌ర్శ‌నం చేసుకోనున్నారు.. ఆ త‌ర్వాత శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ పవర్ హౌస్ సెంటర్‌ను సందర్శించ‌నున్నారు… అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు పవర్ హౌస్ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement