Thursday, January 9, 2025

TG స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ లు – ఉప ముఖ్యమంత్రి భట్టి

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం ..
స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల ఉత్పత్తి
త్వరలో టెండర్లు ఖరారు చేస్తాం
స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ లు
జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ..

హైద‌రాబాద్ – రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యంగా సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటును ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వెల్ల‌డించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటుచేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ల ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రగతిని బుధవారం ఉదయం ప్ర‌జాభ‌వ‌న్ లో మంత్రులు సీతక్క, కొండ సురేఖలతో కలిసి డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తేనే వారి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయని డిప్యూటీ సీఎం తెలిపారు. అందుకుగాను అంది వస్తున్న కొత్త విద్యుత్ పాలసీ, ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య గత సంవత్సరం నవంబర్ 19న కుదిరిన ఒప్పందాన్ని జిల్లా కలెక్టర్లు ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఐదు సంవత్సరాల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించింద‌న్నారు. ఈ క్రమంలో మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నామ‌న్నారు. పెద్ద మొత్తంలో డబ్బు మహిళా సంఘాల చేతులకి వస్తున్న క్రమంలో వారు వివిధ వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వసతులు కల్పించాలని ఆదేశించారు భ‌ట్టి.

- Advertisement -

మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటుకు వారికి అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాల‌ని కలెక్టర్లను ఆదేశించారు. మహిళా సంఘాలు ప్లాంట్ల ఏర్పాట్లు లో ఆర్థిక సహాయం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం చేయాలని కోరారు. మహిళా సంఘాల భూముల్లో ప్లాంట్ లో ఏర్పాటుకు విద్యుత్ శాఖ , రాడ్కో ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వరలో టెండర్లు ఓపెన్ చేసి వాటిని ఖరారు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈ నేపథ్యంలో సంఘాలను గుర్తించి నిర్ధారించడం, భూ సేకరణ, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం వంటి పనులను గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా కలెక్టర్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక మెగావాటు ఉత్పత్తికి నాలుగు ఎకరాలు అవసరం ఉంటుంది.. ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగువేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని కలెక్టర్లకు తెలిపారు.


దేవాదాయ, ఇరిగేషన్ శాఖల పరిధిలోని భూములను గుర్తించాలని సూచించారు.. కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు భూమి అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడిందని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో భూములపై హక్కులు ఏర్పడినప్పటికీ స్తంభాలు వేసి విద్యుత్ లైన్ ల ద్వారా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసే క్రమంలో అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయ‌ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆయా భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని డిప్యూటీ సీఎం సూచించారు. సోలార్ విద్యుత్తు అందుబాటులోకి వస్తే అటవీ ప్రాంతాల్లోని రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెద్ద ఎత్తున పంటలు సాగు చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు ఉప ముఖ్య‌మంత్రి.

ఈ దిశగా కలెక్టర్లు పనిచేస్తే గిరిజనులు ఆత్మగౌరవంతో బతికే అవకాశం స్పష్టంగా ఉందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్మాల్, మైక్రో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నాలుగు నుంచి ఐదు ఎకరాలు భూమి అవసరం అవుతుంద‌న్నారు. చిన్నపాటి ఇండస్ట్రియల్ ఏరియాల ఏర్పాటుకు అధికారులు భూములు సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారం చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్, సర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, జిల్లా కలెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement