హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైనదని.. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకండి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచి నుంచి సమగ్ర కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లుకు పలు సూచనలు చేశారు. డేటా ఎంట్రీ లో నాణ్యత చాలా ముఖ్యమైనది, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు.
సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తేయీ కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధకరించుకోవాలని, వారిని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్దరీకరించుకోవాలి అని తెలిపారు.
కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పాఠశాలలో ఆహారం మరియు పరిశుభ్రతపై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ ప్రత్యేక దృష్టికి సాధించిందని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ రకమైన సమస్యలు తలెత్తకూడదనే మెస్, కాస్మోటిక్స్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశం, జిహెచ్ఎంసి కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.