Friday, November 22, 2024

TG – దాడికి పాల్ప‌డిన వారిని వ‌దిలే ప్ర‌సక్తే లేదు – డిప్యూటీ సీఎం భట్టి

హైద‌రాబాద్ – వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు. అధికారులపై దాడి చేయిస్తే వెనక్కి తగ్గుతాం అనుకుంటున్నారా?, కేసీఆర్ , కేటీఆర్ , హరీశ్ రావు తలకిందులుగా తపస్సు చేసినా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరన్నారు. అభివృద్ధే త‌మ లక్ష్యం అని చెప్పారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. స‌చివాల‌యంలో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఉద్యమ సమయంలో ప్రజలను రెచ్చగొట్టి ప్రాణాలు కోల్పోయేలా చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు వారి స్వార్థం కోసం అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ ఈ దాడిని స‌మ‌ర్దిస్తారా..

కావాలనే కుట్రపూరితంగా కలెక్టర్ పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని భట్టి వి ఫైర్ అయ్యారు. అమాయక గిరిజనులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారని దుయ్యబట్టారు. ఇది బాధ్యత కలిగిన ప్రతిపక్షం చేయాల్సిన పని కాదని, తాము ప్రతిపక్షంలో ఉండగా ఇలా వ్యవహరించలేదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదా అని నిలదీశారు. కలెక్టర్ పై దాడిని కేసీఆర్ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. దాడులు సమస్యలకు పరిష్కారం కాదని ఏదైనా అభ్యంతరం ఉంటే అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛం ఉందన్నారు. పరిశ్రమలను పెద్దఎత్తున తీసుకోచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామాల్లో కూడా అభివృద్ధిని విస్తరిస్తామన్నారు. వెనుకబడిన కొడంగల్ ను అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారని అందులో భాగంగానే కొడంగల్ కు పరిశ్రమలు తీసుకువస్తున్నామన్నారు.

కేటీఆర్ అక్క‌డ‌కు వెళ్లింది అందుకే…

కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై భట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లావ్? ఎవరికోసం వెళ్లావ్? ఎవరిని కలిశావ్? ఏం చేద్దామనుకుంటున్నావ్ అని ప్రశ్నించారు. మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, విచారణకు గవర్నర్ నుంచి అనుమతి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

మహారాష్ట్ర రైతులను ఉద్దరిస్తాన్న మీరు అక్కడ ఎందుకు పోటీ చేయడం లేదని నిలదీశారు. నిన్నటి వరకు బీజేపీతో పోరాటం చేశానని చెప్పుకున్న మీరు ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీకి ఓటు వేయాలని దేనికోసం పిలుపు ఇస్తున్నారన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని ఆ ఒప్పందం కుదిరిన వెంటనే కేటీఆర్ బయటకు వచ్చి మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ఓటు వేయొద్దంటూ చెబుతున్నారన్నారు. తమకు గవర్నర్ పట్ల నమ్మకం ఉందని ఫార్ములా ఈ రేస్ విచారణకు అనుమతి వస్తుందనే విశ్వాసం ఉందన్నారు. ఈ కేసులో చట్టప్రకారం ముందుకు వెళ్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement