సింగరేణికి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ ప్రకారం సింగరేణి కి బొగ్గు బ్లాకులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వినతిపత్రం అందజేశారు. నేడు 10వ బొగ్గు వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి మాట్లాడుతూ, సింగరేణి బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని కేంద్ర మంత్రిని అభ్యర్ధించారు.. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి కాకుండా మొట్టమొదటి సారి కమర్షియల్ బొగ్గు గనుల వేలం ప్రక్రియ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారని అన్న భట్టి . కిషన్ రెడ్డికి తెలంగాణ పరిస్థితులు బాగా తెలుసన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టు, కొంగుబంగారం అన్నారు.
సింగరేణి బొగ్గు వల్లే మన రాష్ట్రంలో థర్మల్ ప్లాంట్స్ నడుస్తున్నాయన్నారు. 130 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్ లు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్రైపాక్షిక ఒప్పందాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. 1400 వందల మిలియన్ టన్నులు బొగ్గును తియ్యడానికి అవకాశం ఇంకా ఉందని తెలిపారు. 2015లో కొత్త చట్టం వల్ల సింగరేణి తనకు ఉన్న అర్హతలను కోల్పోయిందని తెలిపారు. సత్తుపల్లి, కోయగూడ, మరో రెండు బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని కేంద్రం వద్ద ప్రతిపాదన ఉందన్నారు. సింగరేణి ప్రభుత్వ సంస్థకు కేంద్రం సింగరేణికి సహకారం ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గతంలో ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి కోల్ బ్లాక్ కు వెళ్లాయన్నారు. రిజర్వేషన్లు పక్కన పెట్టీ ప్రైవేటీకరణ దిశగా వేలం పాట నడవడం వల్ల సింగరేణికి నష్టం వాటిల్లిందన్నారు. ఇదే విధంగా కొనసాగితే 2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.. ..
రిజర్వేషన్ కోటా లో బొగ్గు బ్లాక్ లు కేటాయించే అంశంలో కిషన్ రెడ్డి చొరవ చూపాలని అన్నారు. అలాగే కిషన్ రెడ్డి అవకాశం ఇస్తే అఖిల పక్షంగా వచ్చి ప్రధానిని కలుస్తామని తెలిపారు. సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి సంస్థ బతకాలి అంటే కొత్త గనులు కేటాయించడం ఎంతో అవసరముందుని తెలిపారు. సత్తుపల్లి, కొయగూడ బ్లాక్ ల పాత లీజు రద్దు చేసి..వాటిని సింగరేణికి కేటాయించాలి కోరుతున్నామన్నారు. సింగరేణి భవిషత్ కోసం మరో 0.5 పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సింగరేణి సంస్థను కాపాడేందుకు చట్టంలో మార్పులు చేయాలని భట్టి డిమాండ్ చేశారు.