హైదరాబాద్ – విద్యతో ఇబ్బందులను అధిగమించవచ్చనే విషయాన్ని బీఆర్ అంబేద్కర్ పూర్తిగా నమ్మారని తెలిపారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అందుకే దేశం వ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాను ఆయన స్థాపించారని గుర్తు చేశారు. సమసమాజ స్థాపనకు యువత మేధస్సు ఉపయోగపడాలనేది తన ఆకాంక్ష అని అన్నారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ లో నేడు జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. ముందుగా ఆయన అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం సకల సమస్యలకు పరిష్కారమని అన్నారు. అసమానతలు లేకుండా ఉంటే భారత్ ఎన్నడో ప్రపంచాన్ని జయించేదని అన్నారు. రాజ్యాంగం ఒక్కటే సకల సమస్యలకు పరిష్కారం చూపుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే సంవిధాన్ సమ్మాన్ బచావ్ సమ్మేళన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. సమాజ పరివర్తన, సమస్యలకు పరిష్కాం చూపేది రాజ్యాంగమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. భారతదేశంలో మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయని ప్రపంచాన్ని జయించే శక్తి, మేధస్సు మనలో ఉందని తెలిపారు. జాతుల మధ్య పోరాటాలతోనే ఆ శక్తి మొత్తం నిర్వీర్యం అవుతోందని భట్టి అభిప్రాయపడ్డారు.