వార్షిక బడ్జెట్లో 50% నిధులు కేటాయించాలి
- సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించండి
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీలకు గొడ్డలి పెట్టు
ఆదిలాబాద్లో బీసీ కమిషన్ తొలి బహిరంగ విచారణ
ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : రాష్ట్రంలో ఇటీవల కొలువుదీరిన బీసీ కమిషన్ తొలిసారిగా అదిలాబాద్ నుంచి బహిరంగ విచారణ ద్వారా వెనుకబడిన వర్గాల నుంచి సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బీసీ కులాలు ఉద్యోగులు, సంచార జాతుల తెగలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో విన్నవించారు. బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అధ్యక్షతన జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాష్, బాల లక్ష్మి ప్రజల నుండి నిర్దేశిత ప్రొఫార్మాలో ఆర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ రాజార్శి షా, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, ఉద్యోగ ఉపాధి రంగాల్లో ప్రతి బంధకంగా ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తొలగించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో బీసీలకు 50 శాతం కేటాయించాలన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో బీసీలకు 50 శాతం నిధులు కేటాయించి సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించాలని కోరారు. వివిధ కుల వృత్తులకు సబ్సిడీ పథకాలు ప్రత్యేక సెజ్ లుఏర్పాటు చేయాలని, చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి సీరియస్ గా నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.మహిళా రిజర్వేషన్ బిల్లులో జనాభా దామాషా ప్రకారం బిసి మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు త్వరితగతిన అందించాలని కోరారు. ఉద్యోగాల పదోన్నతులలో ఎస్సీ ఎస్టీల మాదిరిగా ప్రమోషన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా కమిషన్కు విన్నవించారు.
ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.. కమిషన్
ఈ నెల 17 వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి, రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపై ప్రజల అభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక సమర్పిస్తాం. ఆర్థిక సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం. మున్నూరు కాపు,పద్మశాలి, వడ్డెర, ముదిరాజ్, యాదవ సంఘం, గౌడ్ సంఘం, పోప సంఘాల ప్రతినిధులు తమ అర్జీలను కమిషన్ ముందు విన్నవించారు.