భారీగా మోహరించిన పోలీసులు
ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు
పోలీసుల అదుపులో ఏబీవీపీ నేతలు
ఆంధ్రప్రభ స్మార్ట్, బాసర:
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. దీంతో భారీగా పోలీసులు మోహరించడంతో బాసర పట్టణం ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యకు నిరసనగా ఏబీవీపీ నాయకులు శనివారం ఆందోళన చేస్తున్న సమయంలో ఏబీవీపీ నేత శ్రీనివాస్‌పై సెక్కూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. దీనికి నిరసనగా ట్రిపుల్ ఐటీని ముట్టడించాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఏబీవీపీ నాయకుడిపై దాడికి పాల్పడ్డ సెక్యూరిటీ గార్థులను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల అప్రమత్తం
ఈ ముట్టడి కార్యక్రమానికి హైదరాబాద్, కామరెడ్డి, నిజామాబాద్ తదితర ప్రాంతాల నురంచి పెద్ద సంఖ్యలో ఏబీవీపీ నాయకులు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీసులు ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. దీంతో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో బాసర రైల్వే స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసుల బలగాలను మోహరించారు. తెల్లవారుజామున సికింద్రాబాద్ నుండి బాసర వైపు వచ్చిన తాండూరు, ఇంటర్ సిటీ, దేవాగిరి, సంబల్ పూర్ ట్రైన్లలో వచ్చిన ప్రయాణికులతోపాటు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఐడీ కార్డులు ఉన్న వారిని వదిలేసి అనుమానం ఉన్న ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను అరెస్టులు చేసి పోలీసుల ప్రత్యేక వాహనాలలో జిల్లాలోని బైంసా, ముధోల్, కుంటాల, నిర్మల్, పెంబి, బాసర పోలీస్ స్టేషనులకు తరలించారు.
ట్రిపుల్ ఐటీ వద్ద మూడంచల భద్రత
ట్రిపుల్ ఐటీ వద్ద మూడంచల భద్రతను ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రహరీ చుట్టూ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలోనికి ఎవ్వరిని అనుమతించడం లేదు. ఐడీ కార్డు ఉన్న విద్యార్థులకు, సిబ్బందికి మాత్రమే యూనివర్సిటీలోకి అనుమతినిస్తున్నారు. ఇతరులను మాత్రం పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు.
రైల్వేస్టేషన్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు
సికింద్రాబాద్ నుండి నాందేడ్ వైపు వెళ్తున్న రైళ్లలో బాసర రైల్వే స్టేషన్ లో దిగిన ప్రయాణికులను రైల్వే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. యువకులను అదుపులోకి తీసుకొని వివరాలు తెలుసుకొని ఐడెంటి కార్డు, ఆధార్ కార్డ్ ఉంటేనే వదిలిపెడుతున్నారు. అనుమానాస్పదంగా ఉన్న విద్యార్థులను, ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి పోలీసుల వ్యాన్లు జిల్లాలోని వివిధ స్టేషనులకు తరలిస్తున్నారు.
బాసర ఆలయంలో ఏబీవీపీ నాయకుల అరెస్టు..
బాసర అమ్మవారికి దర్శనానికి వచ్చేసిన భక్తులలో కొందరు ఏబీవీపీ నాయకులు ఉండడంతో పోలీసులు ఆలయంలోకి తరలివచ్చారు. ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. బాసరలో అప్రకటిత రెడ్ అలెర్ట్‌గా ఉంది.