Thursday, January 2, 2025

TG – క‌మీష‌న్లతోనే రేవంత్ స‌ర్కార్ మ‌నుగ‌డ – బండి ఆరోప‌ణ

కాంగ్రెస్ కమీషన్ల సర్కార్
…14 శాతం కమీషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు
… మంత్రుల మధ్య వార్ మొదలైంది
..మాజీ సర్పంచులకు బిల్లులివ్వడం లేదు
.. పనులన్నీ మాజీ సర్పంచులు చేసినవే
…రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటండి
….మీపక్షాన అతి త్వరలో ఉద్యమిస్తాం
…కాంగ్రెస్ మెడలు వంచి బిల్లులు చెల్లించేలా చేస్తాం
…రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగింది
…అల్లు అర్జున్ కు, రేవంత్ కు ఎక్కడో చెడింది
…కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఆంధ్రప్రభ – రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు చేయాలన్నా 8 నుండి 14 శాతం కమీషన్లు దండుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సోమవారం మాజీ సర్పంచులు ప్రభుత్వం తమ బిల్లులు చెల్లించడం లేదని కేంద్రమంత్రికి వినతి పత్రం అందించారు.అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ కేబినెట్ లో కొందరు నిజాయితీ మంత్రులున్నారని వారికి కమిషన్ల వ్యవహారం ఏ మాత్రం నచ్చడం లేదన్నారు. ఈ కమీషన్లపై కాంగ్రెస్ లోనే అంతర్యుద్ధం నడుస్తోందని, ఎప్పుడైనా ఈ కమీషన్ల భాగోతం బద్దలు కావొచ్చన్నారు.

కమీషన్ల మోజులో పడి ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు కప్పం కడుతూ తమ సీటును కాపాడుకోవడానికే కాంగ్రెస్ పాలకులు పరిమితమయ్యారే తప్ప ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు మంజూరు కాక రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు మాజీ సర్పంచులు రోడ్డున పడ్డా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కు చీమ కుట్టినట్లయినా లేదన్నారు. మాజీ సర్పంచులకు కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ అండగా నిలుస్తోందన్నారు. మాజీ సర్పంచుల పక్షాన అతి త్వరలోనే ఉద్యమిస్తామన్నారు. మాజీ సర్పంచ్లకు దాదాపు 13 వందల కోట్ల రూపాయలు బిల్లులు రావాల్సి ఉందని, గ్రామాల్లో చేసిన అభివ్రుద్ధి పనులకుగాను ఒక్కో సర్పంచుకు 3 లక్షల నుండి కోటి రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయాన్నారు.

- Advertisement -

ఏ గ్రామానికి వెళ్లినా పల్లె ప్రగతి, రైతు వేదిక వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రక్రుతి వనం, హరిత వనం, కమ్యూనిటీ హాల్, హైమాస్ లైట్స్, మన బడి వంటి అభివ్రుద్ధి కార్యక్రమాలు కళ్ల ముందే కన్పిస్తున్నాయన్నారు. ఇవన్నీ జరిగాయంటే అది తాజా మాజీ సర్పంచులవల్లేనని ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం సర్పంచులు లేకపోవడంతో గ్రామాల్లో తట్టెడు మట్టి పోయించేటోళ్లు కూడా లేరని చర్చించుకుంటున్నారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బిల్లులన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న రేవంత్ ప్రభుత్వం ఏడాదైనా నయా పైసా బిల్లు చెల్లించ లేదన్నారు. తాజీ మాజీ సర్పంచులారా కాంగ్రెస్ ను నమ్మి మీరు నిండా మోసపోయారని, ఇకనైనా కళ్లు తెరవాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు, జెండాలను పక్కనపెట్టి కాంగ్రెస్ ను ఓడించడమే ధ్యేయంగా చేయాలన్నారు.

రాష్ట్రంలో క్రైం రేటు పెరిగింది

అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో 22శాతం క్రైం రేటు పెరిగింది. మహిళలపై అత్యాచారాలు 28 శాతం పెరిగాయి.శాంతి భద్రతలను కాపాడాలేని చేతగాని సర్కార్ నడుస్తోంది. వీళ్లకు ప్రజల బాధలు పట్టవు. ఢిల్లీకి పోయి కప్పం కట్టి పదవులను కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజలను ఆదుకోవాలని లేదు. 6 గ్యారంటీలను అమలు చేయాలనే ధ్యాస లేదు.

అల్లు అర్జున్ కు రేవంత్ రెడ్డికి ఎందుకు చెడిందో

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టై జైలుకు పోయి బెయిల్ వచ్చాడు. ఆ అంశం ముగిసింది. కానీ మళ్లీ అసెంబ్లీలో మరే సమస్య లేనట్లు ఈ అంశంపై గంటల తరబడి చర్చ జరపాల్సిన అవసరం ఏముంది. 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించాలనే కుట్రలో భాగమే. నాకు తెలిసి రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్ కు మధ్య ఏదో చెడింది. నేనడుగుతున్నా అల్లు అర్జున్ పై కేసును మ్రుతురాలి భర్త వాపస్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు కదా ఇంకా దీనిపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు.

అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్సే

అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ పార్టీ. ఆయనకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు. పంచ్ తీర్థ్ లను ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించేందుకు ఎందుకు ప్రయత్నించింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా ఎందుకు అవమానించారు. నాటి ప్రధాని వీపీ సింగ్ విషయంలో ఇట్లనే అవమానించింది నిజం కాదా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నన్నాళ్లూ సోనియాగాంధీ సూపర్ పీఎంగా ఉంటూ రబ్బర్ స్టాంప్ గా తయారు చేసింది నిజం కాదా. కాంగ్రెస్ తీరును చూసి మన్మోహన్ సింగ్ ఆత్మ క్షోభిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement