Sunday, November 10, 2024

TG – సింగరేణిని దివాళా తీయించింది కేసీఆరే – బండి సంజయ్

కరీంనగర్ ఆంధ్రప్రభ, సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అంటూ కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకాలతోపాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు.

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన తరువాత కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం స్రుష్టిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ రామగుండం వచ్చి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

సింగరేణిలో కేంద్రానిది 49 శాతం వాటా మాత్రమే. రాష్ట్రానిది 51 శాతం ఉంది. అట్లాంటప్పడు రాష్ట్ర అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటీకరించడం ఎట్లా సాధ్యమన్నారు. సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి సీఎం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. తాడిచర్లలో ఏపీ జెన్ కోకు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు అప్పగించింది నిజం కాదా ఆన్నారు. కేసీఆర్ కుటుంబం స్వలాభం కోసం సింగరేణిలో పొట్టుపొట్టు అవినీతి చేస్తే కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందన్నారు.

కేసీఆర్ సర్కార్ గతంలో నయీం కేసు, మియాపూర్ భూములు, డ్రగ్స్, పేపర్ లీకేజీ వంటి వాటిపై సిట్ వేసి మధ్యలోనే నీరుగార్చారన్నారు. కాంగ్రెస్ కూడా అంతే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేస్తూ లాభం పొందాలనుకుంటున్నారే తప్ప ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు మాత్రం మర్చిపోయారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement