భరోసా ఎగ్గొట్టి .. కాస్త ఇవ్వడమే రుణ మాఫీనా
రేవంత్ సర్కార్ పై కేంద్ర మంత్రి బండి గరంగరం
రుణమాఫీలలో కూడా కోతలు పెట్టి మళ్లీ సంబురాలా
రైతులను మోసం చేసి మళ్లీ ఫోజులా
కాంగ్రెస్ సర్కార్ ను దులిపేసిన కేంద్ర మంత్రి
ఆంధ్రప్రభ స్మార్ట్ – కరీంనగర్ – రాబోయే ‘స్థానిక సంస్థల’ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ రుణమాఫీ డ్రామా అని కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి బండి సంజయ్ మండి పడ్డారు. రైతు భరోసా పేరుతో రబీ, ఖరీఫ్ సీజన్ లో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ చేపట్టిన రైతు రుణమాఫీ సంబురాలపై స్పందించిన ఆయన ఏం సాధించారని సంబురాలు చేసుకుంటారన్నారని ప్రశ్నించారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రబీ, ఖరీఫ్‌లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? అంటూ నిలదీశారు. రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకా? అని ప్రశ్నించారు. పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా ఈ సంబురాలు అంటూ మండి పడ్డారు..
ఆ డబ్బులు ఎగ్గొట్టి.. రుణమాఫీకి పిసరంత ఇస్తారా …
రైతు భరోసా సదస్సుల పేరుతో జాప్యం చేస్తూ రైతులను అరిగోస పెడతారా? అంటూ . ఖరీఫ్, రబీ సీజన్‌లో రైతులకు చెల్లించాల్సిన ‘రైతు భరోసా’ సొమ్ము రూ.20 వేల కోట్లకుపైనే అని.. రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టి ఆ డబ్బులో కొంత భాగాన్ని రుణమాఫీకి మళ్లించి రైతులకు మేలు చేసినట్లు ఫోజు కొడతారా? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ మూర్ఖత్వంవల్లే రైతులు డిఫాల్టర్లుగా మారారన్నారు. బ్యాంకులో రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ వడ్డీతో సహా బకాయిలు చెల్లించి ‘నో డ్యూస్ సర్టిఫికేట్’ ఇప్పించే బాధ్యత రేవంత్ సర్కార్‌దే అన్నారు.