మరో చోట ప్లేస్ చూడాలి
వ్యవసాయ వర్సిటీలో నిర్మించొద్దన్న కేటీఆర్
పరిశోధనలు జరగాల్సిన ప్రదేశాన్ని కోర్టు కోసం తీసుకోవద్దు
ఆ వంద ఎకరాల భూమిని వెనక్కి ఇచ్చేద్దాం
నూతన వంగడాలపై పరిశోధనలు చేపట్టాలి
రాష్ట్ర రైతులకు మరింత మేలు జరగాలి
అసెంబ్లీలో సివిల్ కోర్టుల సవరణ బిల్లు
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన బీఆర్ఎస్
ఆంధ్ర్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు భవనం ఆధునికంగా కడుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో కాకుండా మరో చోట కట్టాలని కోరుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. శాసనసభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ భూముల్లో హైకోర్టు భవనం నిర్మించొద్దని.. ఆ యూనివర్సిటీ విద్యార్థులు నెల రోజుల పాటు ఆందోళన చేసినట్టు చెప్పారు.
పరిశోధనలు జరగాల్సిన చోటు..
వ్యవసాయ విద్యాలయంలో పరిశోధనలతో ఫీల్డ్ ఎక్సపరిమెంట్ పరిశోధనలు జరగాలి. ఆ పరిశోధనలకు భూమి అవసరం. రాష్ట్ర రైతంగానికి ఉపయోగపడే విధంగా కొత్త వంగడాలు తీసుకురావాలి. కాబట్టి వ్యవసాయ పరిశోధనలు జరగాల్సిన యూనివర్సీటి భూములను తీసుకోవద్దని కోరుతున్నామని కేటీఆర్ అన్నారు. అగ్రికల్చర్ వర్సిటీకి చెందిన 100 ఎకరాలు తీసుకుంటామన్న ఆలోచన విరమించుకోవాలి. అక్కడ ప్రొఫెసర్లు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు నిరసనలు చేయడం పరిపాటి..
కేంద్ర చట్టాల విషయంలో కర్నాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సీఎంలు ముగ్గురు కూడా తమ తమ రాష్ట్రాల్లో సవరణలు తీసుకోస్తామన్నారు. ఈ చట్టాల ప్రకారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం కూడా నేరం. గతంలో మీ పార్టీ వారు చాలా సార్లు చేశారు. కాబట్టి ఇబ్బందులు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ప్రతిపక్షాలు నిరసనలు చేయడం పరిపాటి. కాబట్టి మీరు సవరణలు తీసుకోస్తారో లేదో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
చట్టాలను దుర్వినియోగం చేసే పరిస్థితి రాకూడదు
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పౌర హక్కుల సంఘం వారు సభ పెట్టుకుంటామంటే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఏ చట్టం ఉపయోగించి నిరాకరించరో తెలియడం లేదు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే డిలీట్ చేయమని ఒత్తిళ్లు వస్తున్నాయి. అనధికారిక ఒత్తిడి, బలప్రయోగం చేయడం సరికాదు. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. చట్టాలను దుర్వినియోగం చేసే పరిస్థితి రాకూడదని కేటీఆర్ అన్నారు.
కాగా, సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. సభ ప్రారంభం కాగానే మంత్రి శ్రీధర్‌బాబు బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం పలువురు సభ్యులు మాట్లాడారు. ఆ తర్వాత బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
సివిల్ కోర్టుల సవరణ బిల్లును స్వాగతిస్తున్నాం: కూనంనేని
సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు ఆమోదం తెలియజేస్తున్నట్లు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ కొట్టుమిట్టాడుతోందని.. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని అంశాలను పరిష్కరించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా చేసేందుకు అనుమతి అడిగితే పోలీసులు నిరాకరిస్తున్నారని చెప్పారు. పోలీస్ శాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు. ఉపా వంటి చట్టాలను కేంద్రం యథేచ్ఛగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపా వంటి చట్టాలను అమలు చేయకుండా నిలువరించాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త న్యాయ చట్టాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలను సవరించే అంశంపై పరిశీలించాలని కూనంనేని సాంబశివరావు కోరారు.
ఉచితంపై రాజకీయాలొద్దు..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ కావాలనే చిల్లర రాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారని విమర్శించారు. మంత్రి సీతక్కపై కావాలనే అభ్యంతకర వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని పొన్నం చెప్పారు. కావాలనే సభలో రచ్చ చేస్తే ఎట్లా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరిపై నిలదీశారు. మహిళలను అందరూ గౌరవించాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.