హైదరాబాద్ – తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి గెలుపు ఢంకా మోగించారు. ప్రత్యర్థి చాముండేశ్వరీనాథ్ మీద ఆయన విజయం సాధించారు. విక్టరీ కొట్టిన అనంతరం ఆయన మీడియాతో, మాట్లాడుతూ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేసిందని సీరియస్ అయ్యారు. హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహిస్తామని వెల్లడించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీపై హడావుడి మాత్రమే చేసిందని విమర్శించారు జితేందర్ రెడ్డి. గతంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ హోదాలో కొందరు చీడపురుగులు ఉన్నారని దుయ్యబట్టారు. యువత మత్తుకు బానిస కాకుండా క్రీడల వైపు వచ్చేలా చేస్తామని జితేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నూతన క్రీడా పాలసీని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.