Monday, November 25, 2024

TG:బీజేపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన


రోడ్లపై పేరుకుపోయిన చెత్తను సేకరించి మున్సిపాలిటీలో పోసి నిరసన
ఏడు రోజులుగా కొనసాగుతున్న పారిశుద్ధ కార్మికుల సమ్మె
నిర్మల్ ప్రతినిధి, అక్టోబర్ 9 (ప్రభ న్యూస్) : నిర్మల్ పట్టణంలో ఏడు రోజులుగా మున్సిపల్ పాశుద్ధ కార్మికులు సమ్మెకు దిగడంతో రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోయింది. బుధవారం పాత బస్టాండ్ లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా మున్సిపల్ ఆవరణలో పోసి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, సాదం అరవింద్ లు మాట్లాడుతూ… హిందువులకు అతిపెద్ద పండుగ అయిన దసరా పండుగ నవరాత్రుల్లో పారిశుద్ధ్య‌ కార్మికులు సమ్మెకు దిగడం, వారి న్యాయమైన కోర్కెలను నెరవేర్చడంలో మున్సిపల్ కమిషనర్ విఫలం చెందారని వారు ఆరోపించారు.

గత మూడు మాసాలుగా పారిశుద్ధ్య‌ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతోనే కార్మికులు సమ్మెకు దిగారని, వారి సమస్యలను పరిష్కరించడంలో ఈ పాలకవర్గ పనితీరు సిగ్గుచేటన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు చేపట్టిన కార్మికుల దీక్షకు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. వెంటనే ప్రభుత్వం కలగజేసుకొని వారికి వేతనాలు పంపిణీ చేయాలని లేనట్లయితే తమ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళన కార్యక్రమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

జిల్లా కేంద్రంలో 42వార్డుల్లో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, దీంతో ఎక్కడ చూసినా అక్కడ దుర్వాసన వెదజల్లుతుందని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పండుగ వేళ విధులకు కార్మికులు దూరంగా ఉండటం వారి సమస్యలు పరిష్కరించకపోవడంతో రెండోసారి సమ్మెకు దిగేదాకా చూసిన పాలకవర్గ తీరుపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు గౌతం గవాస్కర్, బారత్, రమేష్, రచ్చ‌ మల్లేష్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement