ఆంధ్రప్రభ స్మార్ట్ , ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : మున్సిపాలిటీల్లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనర్లపై ప్రభుత్వం అకస్మాత్తుగా బలివేటువేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో అక్రమాలు జరిగాయని, మున్సిపల్ ఆఫీస్‌లో అవినీతి అక్రమాలు పెరిగాయని, ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ మేరకు అక్కడి మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజును ఏడాది తిరగక ముందే ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న ఎండీ ఖమర్ అహ్మద్‌ను నిర్మల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదిలాబాద్ లో ఖమర్ అహ్మద్ అక్రమ మున్సిపల్ లేఅవుట్లపై ఇటీవల కొరడా ఝుళిపించి, పన్నుల వసుళ్లలో లక్ష్యాన్ని అధిగమించారు. ఆయనపై రాజకీయ బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. ఇక డోర్నకల్ మున్సిపల్ కమిషనర్ కే నరేష్ రెడ్డి మరిపెడ మున్సిపాలిటీకి బదిలీ కాగా, ఆయన స్థానంలో మరిపెడ కమిషనర్ ఎం వెంకటస్వామి డోర్నకల్ కు బదిలీపై రానున్నారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ రేట్లో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఈ గణేష్ రెడ్డిని తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.