Sunday, November 3, 2024

TG – 19 రోజులైనా పాఠ్య పుస్తకాలు ఎక్క‌డ‌ … ఇదేనా మీ ప్రజా పాలన – కాంగ్రెస్ సర్కార్ పై హరీశ్ రావు గరం గరం

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ పాఠ్యపుస్తకాలు అందించకపోవడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు స్పందించారు. ఈ అంశంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ పెట్టారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని అన్నారు. 422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారన్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది జీరో అడ్మిషన్స్ నమోదవడం పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు, జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1,654 గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్‌ రావు వెల్లడించారు.

- Advertisement -

రోజు రోజుకీ క్షీణిస్తున్న శాంతి భ‌ద్ర‌త‌లు..

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే శాంతిభద్రతలు క్షీణించాయనేందుకు నిదర్శనమని హరీశ్ రావు అన్నారు. ‘గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్‌లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చేసుకుంది. రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్‌ను భక్షించే దుర్ఘటన నిన్న భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా’మని అన్నారు. గత పదేళ్ళలో శాంతిభద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement