Wednesday, December 25, 2024

TG – రేవ‌తి కుటుంబానికి అండ‌గా సినీ రంగం …. దిల్ రాజు

హైద‌రాబాద్ – సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడం బాధాకరమన్నారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు. ఆమె కుటుంబానికి చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను నేడు పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ… ఈ ఘటనను ఎవరైనా కావాలని చేస్తారా? రేవతి కుటుంబం వినోదం కోసం సినిమాకు వెళితే ప్రమాదవశాత్తు ఇలా జరిగిందని ఆవేదన చెందారు. రేవతి భర్త భాస్కర్‌కు శాశ్వత ఉపాధిని కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సినిమా పరిశ్రమలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కాగా, రేవంత్ రెడ్డి తనను ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించారని, అమెరికాలో ఉన్నందున ఇన్ని రోజులు ఆయనను కలవలేకపోయానన్నారు. అమెరికా నుంచి రాగానే సీఎంను కలిసినట్లు చెప్పారు. అల్లు అర్జున్ సహా సినిమా పెద్దలను కలుస్తానని… అనంతరం పరిశ్రమ అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డికి చెబుతానన్నారు. ఇందుకోసం రేపు లేదా ఎల్లుండి సీఎంను మరోసారి కలుస్తానన్నారు. తాను ప్రభుత్వాన్ని, సినీ పరిశ్రమను సమన్వయం చేస్తానన్నారు.

చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారం మాత్రమే అన్నారు. చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలో సీఎంను కలిసి అన్ని విషయాలపై చర్చిస్తామన్నారు. ఎలాంటి సమస్య రాకుండా చూసే బాధ్యత తనదే అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ వేగంగా రికవరీ అవుతున్నాడని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement