స్థానికులకు ఉపాధి కల్పన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు
ఆ గ్రామాలన్నీ కలిపి ఒక పంచాయతీ
వనమహోత్సవంలో మొక్కలు నాటిన సీఎం, మంత్రులు
ఉమ్మడి వరంగల్, ప్రభ న్యూస్ ప్రతినిధి : కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి, సాయంపేట ఊకలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కును సందర్శించారు. టెక్స్ టైల్స్ పార్కుల్లో స్థానికులకు ఉపాధి కల్పంచాలని ఆదేశించారు. భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. 1200 నుంచి 1400 వరకు భూ నిర్వాసితులు ఉన్నారని, నిర్వాసిత పునరవాస ప్రాంతాలను కలిపి ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ పంచాయతీలో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం..
వరంగల్ పర్యటనకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. చింతలపల్లి, సాయంపేట ఊకలులో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్‌కు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. ఇక్కడకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే లు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
వనమహోత్సవం…
టెక్స్టైల్స్ పార్కులోని ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఆయనతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, సీతక్క, కోమటి రెడ్డి వెంకట రెడ్డి తదితరులు కూడా మొక్కలు నాటారు. అనంతరం మరికొన్ని టెక్స్టైల్స్ పార్కులను సీఎం సందర్శించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిభిషన్‌ను ఆయన పరిశీలించారు. వరంగల్ సెంట్రల్ జైల్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 24 అంతస్థుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు.