Monday, November 25, 2024

ఈనెల 27న టెట్‌ ఫలితాలు.. పేపర్‌-1లో 4 ప్రశ్నల్లో దొర్లిన తప్పులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రశాంతంగానే ముగిసింది. ఈ పరీక్షకు 90 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు కన్వీనర్‌ రాధారెడ్డి తెలిపారు. ఈనెల 27న ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఉదయం నిర్వహించిన పేపర్‌-1కు 3,18,506(90.62) మంది, పేపర్‌-2కు 2,51,070(90.35) శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి అత్యధికంగా పేపర్‌-1కు 97.85 శాతం, పేపర్‌-2కు 96.65 శాతం మంది అభ్యర్థులు హాజరవగా, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా నుంచి పేపర్‌-1కు 82.06 శాతం, పేపర్‌-1కు 81.45 శాతం మంది హాజరయ్యారు.

సంగారెడ్డి జిల్లాలో టెట్‌ పరీక్షకు ఆలస్యంగా వచ్చారని ఒక అభ్యర్థికి అనమతి నిరాకరించినట్లు తెలిసింది. పటాన్‌చెరు సెయింట్‌ జోసఫ్‌ హైస్కూల్లో టెట్‌ పరీక్ష రాసేందుకు ఓ అమ్మాయి ఆలస్యంగా రావడంతో 16 నిమిషాలు ఆలస్యంగా వచ్చారంటూ అధికారులు ఆమెను అనుమతించలేదని సమాచారం. అధికారులు మాత్రం ఇలాంటి సంఘటనలు ఎక్కడా చోటుచేసుకోలేదని చెప్పారు. టెట్‌ పేపర్‌-1లో నాలుగు ప్రశ్నలకి తెలుగు అనువాదం, ఆప్షన్‌ విధానం తప్పుగా ఇచ్చారని డీఎడ్‌ బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

గత టెట్‌ పరీక్షలతో పోలిస్తే ఆదివారం జరిగిన టెట్‌లో ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందని అభ్యర్థులు తెలిపారు. గత టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు ఎక్కువ స్కోర్‌ కోసం ఈసారి మళ్లిd రాయగా వారికి అంతగా స్కోర్‌ పెరిగే అవకాశం లేదని అంటున్నారు. పాస్‌ పర్సెంటేజ్‌ పెరిగినా గతంలో వచ్చినట్లు ఎక్కువ మార్కులు రావని అభ్యర్థులు తెలిపారు. కొత్తగా టెట్‌ రాసిన అభ్యర్థులు కూడా ఎక్కువ స్కోర్‌ చేయకున్నా పాస్‌ అవుతామని పేర్కొన్నారు.

కాస్త కఠినంగా పేపర్‌-1…
టెట్‌ పేపర్‌-1లో గతంలో 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ ప్రశ్నలు ఇవ్వగా ఈసారి మాత్రం 10వ తరగతి లెవల్‌లో అడిగారు. ఇక టెట్‌ రెండు పేపర్లలో తెలుగు గ్రామర్‌ సులభంగా ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. మిగతా విభాగాల్లో వినియోగానికి, అవగాహనకి సంబంధించిన ఎక్కువ ప్రశ్నలు అడిగారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement