Thursday, November 21, 2024

TS | సెప్టెంబర్‌ 15న టెట్‌ పరీక్ష.. రేప‌టి నుండి దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకోసం ఎదురుచూసే నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంగళవారం నాడు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నోటిఫికేషన్‌ను ఈమేరకు విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 27న ఫలితాలను వెల్లడించనున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. గతేడాది 2022లో మార్చిలో వేసిన నోటిఫికేషన్‌ నుంచి ఈ అవకాశాన్ని కల్పించారు. బీఎడ్‌ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. అంటే బీఈడీ వాళ్లు పేపర్‌-1, 2.. డీఎడ్‌ వాళ్లు మాత్రం పేపర్‌-1 మాత్రమే రాయనున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో టెట్‌ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్‌ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించడంతో టెట్‌ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

అర్హత సాధించని వారు 2 లక్షల మంది…

ఇప్పటి వరకు రాష్టంలో 1.5 లక్షల మంది డీఎడ్‌, 4.5 లక్షల మంది బీఎడ్‌ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్‌ ద్వారా 8,792 టీచర్‌ పోస్టులను భర్తీచేశారు. గతంలో -టె-ట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్‌ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్‌ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. బీఎడ్‌ అభ్యర్థులు ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పోటీపడవచ్చు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది టెట్‌ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఎడీ, డీఎడ్‌ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకుంటారు. అదేవిధంగా ఫైనలియర్‌ చదువుతున్నవారికి కూడా టెట్‌ రాసుకునేందుకు ఈసారి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు నాలుగు లక్షల మంది గత టెట్‌లలో అర్హత సాధించి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్టీ) కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో స్కోర్‌ కోసం రాసేవారితోపాటు, అర్హత సాధించని వారు, కొత్తగా రాసేవారు కలిపి సుమారు 4లక్షలకు పైగా అభ్యర్థులు ఈసారి టెట్‌ పరీక్ష రాసే అవకాశం ఉంది. తాజా -టె-ట్‌ నిర్వహణతో వీరందరికీ మరొసారి పోటీ-పడే అవకాశం దక్కుతుంది.

- Advertisement -

గతంలో ఫీజు రూ.300లే….

టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఫీజును రూ.400గా నిర్ణయించారు. 2016, 2017 టెట్‌ నిర్వహించినప్పుడు టెట్‌ పరీక్ష ఫీజు రూ.200 మాత్రమే ఉండేది. ఆతర్వాత 2022 జూన్‌ 12న నిర్వహించిన టెట్‌కు రూ.100 పెంచుతూ ఫీజును రూ.300 చేశారు. ఇప్పుడు దానికి మరో వంద రూపాయలు పెంచేసి రూ.400 ఫీజును వసూలు చేయనున్నారు. ఒక్క పేపర్‌ రాసినా రూ.400లే ఫీజు, రెండూ పేపర్లు రాసినా ఫీజు రూ.400లే. టెట్‌లో అర్హత సాధించాలంటే జనరల్‌ అభ్యర్థులకు 60 శాతం మార్కులు రావాలి. బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ ఎస్టీ పీహెచ్‌ అభ్యర్థులు 40 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది.

మరీ టీఆర్టీ ఎప్పుడు?

టెట్‌ కంటే కూడా టీఆర్టీ నోటిఫికేషన్‌ కోసం ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్‌ పడిన కాన్నుంచి ఫలితాలు ప్రకటన వరకు మొత్తం 58 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. సెప్టెంబర్‌ 27న ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే అక్టోబర్‌ మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టీఆర్టీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే అక్టోబర్‌ 20వ తేదీలోపే జారీ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇక ఎన్నికలు ముగిసిన తర్వాతే టీఆర్టీ ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించనేలేదు.

టెట్‌ ముఖ్యమైన తేదీలు

దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16
రాతపరీక్ష: సెప్టెంబర్‌ 15
పేపర్‌-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపర్‌-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
పరీక్ష ఫీజు: రూ.400
ఫలితాలు: సెప్టెంబర్‌ 27న
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

టీఆర్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి: రావుల రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు
ప్రభుత్వం టీఆర్టీపైన త్వరగా నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 15న టెట్‌ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ వచ్చేలోపే నోటిఫికేష్‌ వేయాలి. గతంలో సీఎం పేర్కొన్న 10వేల టీచర్‌ పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్‌ జారీ చేసి భర్తీ చేయాలి. 4 లక్షల మంది అభ్యర్థులు టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నారు. టీఆర్టీ భర్తీకు ఆర్థికశాఖ అనుమతినివ్వాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement