Friday, November 22, 2024

డ్రగ్స్‌ దందా వెనుక టెర్రరిస్టు లింకులున్నయ్.. బండి సంజయ్‌ ఆరోపణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్‌ దందా వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్నిహితులతో పాటు టీఆర్‌ఎస్‌ నేతల హస్తముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ డ్రగ్స్‌ దందాకు అడ్డాగా మారడంతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు తలదించుకునేలా చర్చ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుండే డ్రగ్స్‌ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, ప్రముఖుల ప్రమేయం ఉందని విచారణలో వెల్లడైందన్నారు. నాటి కేసు విచారణ సంగతి ఏమైందని, ఈ కేసులో ఏం సాధించారో సమాధానం చెప్పాలన్నారు. నాటి కేసు రికార్డులను, ఆధారాలను సమర్పించాలని ఈడీ కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.ఈ వ్యవహారంపై హైకోర్టు ఆదేశించినా… చివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎక్సైజ్‌ కమిషనర్‌కు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వివరాలు ఇవ్వడానికి భయపడుతోందని ప్రశ్నించారు. ఈ డ్రగ్స్‌ దందా వెనుక సీఎం సన్ని#హతుల, టీఆర్‌ఎస్‌ నేతల హస్తం ఉందని, ఈడీకి ఆధారాలు సమర్పిస్తే వారి పేర్లు బయటకు వస్తాయనే భయంతోనే సీఎం ఆ వివరాలివ్వకుండా తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు.

శుక్రవారం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్‌ డ్రగ్స్‌, తాగుబోతులు, మాఫియాలకు అడ్డగా మారిందని, యువత జీవితాలు నాశనమవుతున్నాయని తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. డ్రగ్స్‌ను నిర్మూలించాలనే సోయి కేసీఆర్‌కు లేదని మండిపడ్డారు. పంజాబ్‌ లో ప్రభుత్వం కూలిపోవడానికి డ్రగ్స్‌ దందాయే కారణమని, టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణ పాఠం చెప్పబోయేది కూడా డ్రగ్స్‌ వ్యవహారమేనని చెప్పారు. డ్రగ్స్‌ దందాలో టీఆర్‌ఎస్‌ నేతల ప్రమేయం ఉందని, సమీక్ష పేరుతో సీఎం కేసీఆర్‌వి ఊకదంపుడు మాటలే తప్ప చేతల్లేవన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు వెయ్యి మందితో కమిటీ వేస్తానని చెప్పిన కేసీఆర్‌ మాటలు ఏమౖయ్యాయని ప్రశ్నించారు. వెయ్యి మందితో కమిటీ దేవుడెరుగు… వెయ్యి మంది డ్రగ్స్‌ బాధితులు మాత్రం దొరికారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement