Wednesday, December 18, 2024

Tension – తాడ్వాయి అడ‌వుల్లోకి పెద్ద‌పులి రాక

ప‌రిశీలిస్తున్న అట‌వీశాఖ సిబ్బంది
ఆ పులికి హాని తలపెట్టొద్దు
గ్రామ‌స్తులు జాగ్రత్తగా ఉండాలి
హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నుంచి పెద్దపులి ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి ప్రవేశించింది. తాడ్వాయిలో అడ‌వుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నర్సాపూర్ సమీపంలోని గౌరారం వాగు వ‌ద్ద‌ పెద్దపులి అడుగులను గుర్తించారు. చౌలేడు, కేశవపురం గ్రామల వైపు ఆ పులి వెళ్లి ఉంటుందని ఫారెస్టు రేంజ‌ర్ ఆఫీస‌ర్ స‌త్త‌య్య తెలిపారు.

తాడ్వాయి అడ‌వుల్లోకి నో ఎంట్రీ..

మంగపేట,తాడ్వాయి, కరకగుడేం, గుండాల అడవుల్లో పెద్దపులి మకాం వేసినట్లు అధికారులు గుర్తించారు. అట‌వీ ఉత్పత్తుల సేకరణ, పశువుల మేత కోసం గ్రామస్తులు అడవులకు వెల్లకుండా ఫారెస్ట్ అధికారులు నియంత్రిస్తున్నారు. పులికి ఆపద రాకుండా చూసుకోవాలని గ్రామస్తులకు సూచిస్తున్నారు. ఈ పెద్దపులి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి, ఇటు ములుగు జిల్లాలోకి తిరుగుతున్న పరిస్థితి ఉందని తెలిపారు.

మూడేళ్ల కింద‌ట‌…

- Advertisement -

కూడాకరకగూడెం, ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో మూడేళ్ల కింద‌ట పులి సంచ‌రించింద‌ని అటవీశాఖ అధికారులు అన్నారు. అప్పట్లో ఒక ఆవుని కూడా పులి చంపి తిందని, ఆ తర్వాత నుంచి పులి ఆనవాళ్లు కనిపించకుండా పోయాయని అన్నారు. మళ్ళీ తిరిగి పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో మూడు రోజుల నుండి పులి కలకలం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. పులి ఎప్పుడొచ్చి తమను ఏ ప్రమాదానికి గురి చేస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement