వరంగల్ క్రైమ్ ఆగస్టు 14 (ప్రభ న్యూస్) ఓరుగల్లు మహా నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేకత విధానాలను నిరశిస్తూ వరంగల్ బల్దియా ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డిసిపి బారి నేతృత్వంలో ఎం జి ఎం జంక్షన్ లో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడిక్కడే కాంగ్రెస్ శ్రేణులను అరెస్టులు చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బల్దియా కార్యాలయం వైపుకు వెళ్లకుండా భారీ కేడ్లు పెట్టి రాకపోకలను నిషేధించారు.ఎం జి ఎం సెంటర్లోనే కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటుండటంతో ఉద్రిక్తత నెలకొంది.
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందడమే కాక, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడాన్ని నిరాశిస్తూ మున్సిపల్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో మున్సిపల్ ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ నాయకులను ముందుస్తుగా అరెస్ట్‌లు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నాకు పోలీసులు అనుమతించలేదని సెంట్రల్ జోన్ డిసిపి బారి స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మరోవైపు.. పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా ధర్నా చేసి తీరుతామని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. దీంతో, డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్‌లతో ఆందోళనను అడ్డుకోలేరంటూ వ్యాఖ్యలు చేశారు.