హనుమకొండ, జులై 13 : కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ లో స్లాబ్ పెచ్చులూడి కింద పడ్డాయి. అదృష్టం కొద్దీ ఆ రూంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవల ఒక అమ్మాయికి ఫ్యాను ఊడి మీద పడి తల పగిలిన ఘటన చోటుచేసుకుంది. దాంతో అందరూ వచ్చి హడావిడి చేశారు.. కానీ వాటిని మార్చే చేసే ప్రయత్నం అయితే ఎవరూ చేయలేదు. మొన్న ఫ్యాన్ ఊడి విద్యార్థినిపై పడడం, ఇప్పుడు పెచ్చులూడి పడడంతో విద్యార్థుల పరిస్థితి టెన్షన్ టెన్షన్ గా ఉంది.
కాకతీయ యూనివర్సిటీలో అనేకమైన దారుణాలు జరుగుతున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురాతన భవనాల్లో హాస్టల్స్ నిర్వహిస్తుండడంతో ఎప్పుడు ఏ భవనం పెచ్చులూడి పడతాయో, ఎవరిపై ఫ్యాన్లు ఊడి పడతాయో అన్న భయంతో కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి కొత్త భవనాలను నిర్మించి విద్యార్థులకు అన్ని వసతులున్న భవనాల్లోకి హాస్టల్స్ మార్చాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.