- చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకున్న రైతులు
- మహిళ ఆత్మహత్యాయత్నం
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఆంధ్రప్రభ స్మార్ట్, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎల్కేశ్వరం గ్రామంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు రోజులుగా ఎల్కేశ్వరంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ కాలువ పనులను రైతులు అడ్డుకుంటున్నారు. నష్టపరిహారం చెల్లించి పనులు చేసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
మహిళ ఆత్మహత్యాయత్నం…
పనులను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న మహాదేవపూర్ పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఎల్కేశ్వరం గ్రామానికి చెందిన రాళ్ల బండి కమల అనే మహిళ మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే పోలీసులు గమనించి మహదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధిత రైతులు మహాదేవపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి ఆందోళనకు దిగారు.