మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్ల సభ వేదికగా మాట్లాడుతు మాటలన్ని పచ్చి అబద్ధాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇవాళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందిస్తుందని అన్నారు. తాము గొప్పగా ఇందిరమ్మ పాలనను అందిస్తుంటే.. బీఆర్ఎస్ విమర్శిస్తోందని మండిపడ్డారు.
యాద్రాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులను టెండర్లు పిలవకుండా తనకు నచ్చిన వారికి ..కమీషన్లు ఇచ్చిన వారికి కట్టబెట్టారని భట్టి విక్రమార్క ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని 7లక్షల కోట్ల అప్పుల పాలు చేశారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎకరం భూమికి కూడా నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి ఏడాదికి పదివేల కోట్ల విద్యుత్ బిల్లులు కట్టేలా చేశారని ఆరోపించారు. పదేళ్ల పాటు రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగించారని ధ్వజమెత్తారు. భావప్రకటన స్వేచ్ఛ లేకుండా కేసీఆర్ పాలించారని మండిపడ్డారు.