Saturday, November 23, 2024

Kartika Pournami: శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

ఇవాళ కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కి చాలా విశిష్టత ఉంటుంది. ఇక ఇదే సమయంలో పరమ పవిత్రంగా భావించే కార్తీక సోమవారం నాడు, కార్తీక పౌర్ణమి రావడం మరీ ప్రత్యేకం. దీంతో భక్తులు విశేషంగా ఆలయాలకు పోటెత్తుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రముఖ శైవక్షేత్రాలు కార్తీక పౌర్ణమి తో పాటు, కార్తీక సోమవారం కారణంగా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలలో భక్త జనం బారులు తీరారు.

తెల్లవారు జాము నుండే కార్తీక స్నానాలు
తెల్లవారుజామున కార్తీక సోమవారంతో పాటు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు నదీ స్నానాలు ఆచరించారు. కాళేశ్వరం దగ్గర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. ఇక మంగపేట పుష్కరఘాట్ లోనూ గోదావరి నదిలో నదీ స్నానాలు ఆచరించిన భక్తులు, అత్యంత భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. అమరావతి లోని కృష్ణా నది తీరాన కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

తెలంగాణాలో చారిత్రక శైవ క్షేత్రాలలో భక్తుల పూజలు
తెలంగాణ‌లోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కార్తీక రెండవ సోమవారం సందడిగా మారింది. హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో భక్తజనంతో పోటెత్తింది. రామప్ప ఆలయంలోనూ, పాలకుర్తి సోమేశ్వరాలయం లోనూ భక్తులు విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం లోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం లోనూ భక్తులు పూజాదికాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ కార్తీక సోమవారం రద్దీ కొనసాగుతోంది.

- Advertisement -


ఏపీలోనూ పోటెత్తుతున్న ప్రముఖ శైవ క్షేత్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కార్తీక సోమవారం నాడు భక్తులు ఆలయాల బాటపట్టారు. త్రిపురాంతకం, బైరవకోన, ఒంగోలు కాశీ విశ్వేశ్వర స్వామి, రాజరాజేశ్వరస్వామి ఆలయాలలో భక్తజనం పోటెత్తారు. ఇక కాకినాడలో కార్తీక సోమవారం సందర్భంగా పంచారామాల వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ద్రాక్షారామం, కుమారారామం భీమేశ్వర స్వామి దేవస్థానాలు భక్తులతో సందడిగా మారాయి. శ్రీశైలం లోనూ, శ్రీకాళహస్తి, కపిలతీర్థం లోను ప్రత్యేక పూజలతో శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో నేడు కార్తీక పౌర్ణమితో పాటు, కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు ఆలయాలలోకొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement