Friday, November 22, 2024

Temple Rush – వరుస సెలవులు… వైకుంఠ ద్వార దర్శనాలు… భక్త జనసంద్రంగా ఆలయాలు

హైదరాబాద్ / తిరుమల ‍ … వరుసగా మూడు రోజులు సెలవులు, అపై వైకుంఠ ద్వారా దర్శనాలు.. దీంతో ఎపి, తెలంగాణాలోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రాలు భ‌క్తుల‌తో కిట‌కిటలాడుతున్నాయి.. తిరుమ‌లలో ద‌ర్శ‌నానికి 16 గంటలు ప‌డుతుంటే, యాదాద్రి, వేముల‌వాడ‌లో నాలుగు గంట‌ల స‌మ‌యం తీసుకుంటున్న‌ది..
ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. నేడు(సోమవారం) త్రయోదశి శ్రీవారి దర్శనం కోసం భక్తులు కిటకిటలడుతున్నారు. వరుసగా సెలవులు నేపధ్యంలో దర్శనానికి భక్తులు బారులు తీరారు. త్రయోదశి సందర్భంగా ప్రముఖులు శ్రీవారి దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జడ్జి కృపాసాగర్, సుప్రీంకోర్టు జడ్జ్ నాగరత్నం, హైకోర్టు జడ్జ్ కే సురేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోహిత్, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇది ఇలా ఉంటే వైకుంఠ ద్వాదశి నాడు(ఆదివారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,519. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,424. ద్వాదశి నాడు శ్రీవారి హుండీ ఆదాయం 5.05 కోట్లు వచ్చింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రొజల్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 131,425. ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల్లో హుండీ ఆదాయం 7.55 కోట్లు వచ్చింది. తిరుపతిలో కేటాయిస్తున్న ఉచిత వైకుంఠ ద్వార దర్శన టికెట్లు పూర్తి అయ్యాయి.

తెలంగాణాలోని ఆలయాలలోనూ పోటెత్తిన భక్తులు..

తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి, భద్రాచలం,వేములవాడ, ధర్మపురి లలో సోమవారం నాడు సైతం భక్తులు పోటెత్తారు.. నేటి ఉదయం నుంచే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శనానికి భారీగా తరలివస్తున్నారు.
దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది.
శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అధ్యయనోత్సవ భాగంగా నేడు మూడవ రోజు ఆలయ మాడ వీధుల్లో శ్రీరామ అలంకారంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాద కౌంటర్లు, నిత్యా కల్యాణం, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణం నెలకొంది. భక్తులకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు.

మరోవైపు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భద్రాచలం రామాలయానికి సైతం భక్తులు పోటెత్తారు. ఆలయంలోని అన్ని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ప్రసాద కౌంటర్లలోనూ భారీ రద్దీ నెలకొంది. నిత్య కల్యాణానికి దంపతులు భారీగా తరలివచ్చారు. ప్రధానాలయంలో మూలవిరాట్‌ ముత్తంగి (ముత్యాల వస్త్రాలు ధరించిన) రూపంలో స్వామి వారు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఉండడంతో దర్శనానికి మూడు గంటల పైగా సమయం పడుతుంది. ఇక వేములవాడలోనూ భక్తల ప్రవాహం కొనసాగుతున్నది.. ధర్మపురిలోనూ దైవ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement