పిసిపి అధ్యక్షుడి ఫోటోతో పోస్టర్
నేను ఒక నియంత…అంటూ ముద్రణ
150 ప్రశ్నలు రూపొందించలేరా..
సిగ్గు.. సిగ్గు అంటూ వ్యాఖ్యలు
హైదరాబాద్ – తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలు, గేట్లపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. నాంపల్లిలోని టీజీపీఎస్సీ ఎదుట, హైదరాగూడలోని తెలుగు అకాడమీ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. ఆ పోస్టర్లలో తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికంగా లేవని.. ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఎవరూ కొనవద్దని విజ్ఞప్తి చేశారు.
అలాగే టీజీపీఎస్సీ ఎదుట నేను ఒక నియంత అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అంతేకాదు గ్రూప్-1లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 150 ప్రశ్నలను ఎందుకు సిద్ధం చేయలేదని సిగ్గు సిగ్గు అని పోస్టర్లు వెలిశాయి. ఉదయాన్నే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఈ పోస్టర్లు దర్శనం ఇవ్వడంతో కమిషన్ సిబ్బంది దీనిని తొలగించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టర్లు ఎవరు వేశారు అని ఆరా తీస్తున్నారు.