అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళ్లర్పించారు.
అనంతరం మహాత్మ గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్పూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏళ్లపాటు తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ నాయకత్వంలో కొనసాగించామని వెల్లడించారు.
ప్రజా పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో, అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు పది సంవత్సరాలు మా ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే ప్రగతి వస్తుంది, ప్రగతి తోనే సమానత్వం వస్తుంది అన్న ఆయన ఆలోచనతో 1,022 గురుకులాలు పెట్టుకున్నామన్నారు.