షాద్ నగర్ ప్రభాన్యూస్ : దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్య చేసిన నిందితులను ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు పాలాభిషేకం చేసి ఆ పాలను నెత్తిమీద జల్లుకుంటామని వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకురాలు రమాదేవి తెలిపారు. దిశ ఎన్కౌంటర్ సందర్భంగా మూడేళ్ల తర్వాత సిర్పూర్కార్ కమిషన్ ఇచ్చిన నివేదికతో 10 మంది పోలీసుల పై హత్యా నేరం కింద కేసు నమోదు చేయమని సిఫారసు చేయడం సిగ్గుచేటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం ఎటుపోతోంది అని ఆమె వ్యాఖ్యానించారు. దిశ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ కన్నీరు ఆగడం లేదని ఆ మానవ మృగాలు చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో కొత్త నాటకానికి తెర తీయడం సమంజసం కాదని ఆమె విరుచుకుపడ్డారు. అంతేకాదు దిశ ఎన్ కౌంటర్ బృందానికి ఆమె తన సెల్యూట్ తెలిపారు. అవసరమైతే ఆ పది మంది పోలీసులను పాలాభిషేకం చేసి ఆ నీళ్ళను నెత్తిమీద చల్లుకుంటామని, అందుకు మహిళాలోకం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అనవసర రాద్ధాంతం సృష్టించి ఆడపిల్ల బ్రతుకును నాశనం చేయడమే కాకుండా.. ప్రాణాలు తీసిన కిరాతకులని ఎన్ కౌంటర్ లో చంపడం పెద్ద తప్పేమీ కాదని అన్నారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం చేసిన కాల్పులను తప్పు పట్టడం విచిత్రంగా ఉందని రమాదేవి ఆవేదన వెలిబుచ్చారు. సమాజంలో నానాటికి పెరిగిపోతున్న ఆకృత్యాలను పోలీసులు చూస్తూ ఉంటారా అని ఆమె ప్రశ్నించారు. పంట చేనులో పెరిగిన మెరికలను ఏరివేసినట్లు నేరస్తులను కూడా ఏరి పారేయాలని, పోలీసుల వెనక ప్రజలు ముఖ్యంగా మహిళలు ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. దిశ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పది మంది పోలీసుల బృందానికి మహిళా లోకం అండగా ఉందని ఆనాడు ఈనాడు ఏనాడు అయినా వారికి సమాజం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎన్కౌంటర్ పోలీసు సిబ్బందికి ప్రభుత్వం, పోలీసు, మీడియా అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement