Sunday, November 24, 2024

Telangana – యంగెస్ట్ స్టేట్ మాదే… భవిష్యత్ మాదే: రేవంత్ రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని.. త‌మ‌ రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్ లో 16వ ఆర్ధిక సంఘ సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని చెప్పారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు.

భారీ రుణ‌భారం తెలంగాణ‌కు స‌వాళ్లు
భారీ రుణ భారం తెలంగాణకు సవాల్‌గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్ప‌డింద‌ని, రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయ‌న అన్నారు. ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు త‌మ‌కు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

- Advertisement -

రుణాన్ని రీ స్ట్ర‌క్చ‌ర్ చేసే అవ‌కాశం ఇవ్వాలి
రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వండి.. లేదా త‌మ‌కు అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాల‌ని సీఎం కోరారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచాల‌న్నారు. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ను మీ ముందు ఉంచుతున్నామని, ఈ డిమాండ్ ను నెరవేర్చితే.. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకారిస్తామ‌ని అన్నారు. తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో త‌మ‌ వంతు బాధ్యతను నేరవేరుస్తామన్నారు. ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో మీ మద్దతు కోరుతున్నామన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మీ సిఫారసులు ఉపయోగపడతాయని నమ్ముతున్నామన్నారు. ..

Advertisement

తాజా వార్తలు

Advertisement