ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి
హాజరైన మెగాస్టార్ చిరంజీవి
చిలుకూరు – తెలంగాణలో వెయ్యి స్థంబాల గుడి, రామప్ప దేవాలయం, కవ్వాల్, నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ , మల్లెల తీర్థం వంటి దర్శనీయ ప్రాంతాలు ఉన్నా టూరిజం అభివృద్ది జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న సందర్శనీయ ప్రాంతాలు ఇక్కడ ఉన్నా గత ప్రభుత్వం వాటిని ప్రొమోట్ చేయడంలో విఫలమైందని అన్నారు.. అందుకే పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు..
ప్రొద్దుటూరు గ్రామం, చిలుకూరు టెంపుల్ రోడ్లో ఎక్స్పీరియం పార్క్ ను రేవంత్ రెడ్డి , మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నేడు ప్రారంభించారు. ఈ సందర్భగా రేవంత్ మాట్లాడుతూ,. రామ్‌దేవ్ రావు 150 ఎకరాల్లో అద్భుతాన్ని సృష్టించారని అన్నారు.
మందిరాల దర్శనాల కోసం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాంమని, అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు.. అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని ఎత్తి పొడిచారు రేవంత్ . వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, వేములవాడ వంటి ప్రముఖ ఆలయాలున్నాయని చెప్పారు. కవ్వాల్, నల్లమల రిజర్వ్ ఫారెస్ట్, మల్లెల తీర్థం వంటి ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇక్కడ ఇన్ని ఉన్నా తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖులు, వారి పిల్లల వివాహాలు.. టెంపుల్ టూరిజం మెరుగ్గా ఉన్న ప్రాంతాలు అయిన, గుజరాత్, రాజస్థాన్, జైపూర్ ప్రాంతాల్లో జరుగుతున్నాయని గుర్తు చేశారు. అయితే సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికి ప్రాముఖ్యత లభించడం లేదని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. అయితే వీటికి ప్రభుత్వం, ప్రముఖులు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వకపోవడం వల్లే మన ప్రాంతాలు వెనుకబడి పోయాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే టెంపుల్, ఎకో టూరిజం పై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ‘పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం, ఐటీ, ఇన్ఫ్రా రంగాలతో, నిర్మాణ రంగాల్లో రాణించేలే ప్రణాళికలు అమలుచేస్తున్నామన్నారు రేవంత్. అలాగే రాష్ట్రానికి ఆదాయం రావాలంటే.. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ముఖ్యమైనవి అని.. ఇవి ఆదాయంతో పాటు, రాష్ట్ర విలువలను పెంచుతాయని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే రామ్ దేవ్ రావు ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేశారని ఆయన 150 ఎకరాల్లో అద్భుతాన్ని సృష్టించారని కొనియాడారు. అలాగే భవిష్యత్తులో ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి , ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు, మాజీ కేంద్రమంత్రి టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.