Friday, November 22, 2024

KRMB సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్‌

కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం నుంచి తెలంగాణ అర్ధాంతరంగా వాకౌట్ చేసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన భేటీ జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. సుమారు ఐదు గంటలకుపైగా సమావేశం కొనసాగింది. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై చర్చ జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఇతర అంశాలపై చర్చించారు. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి, గోదావరి జలాల మళ్లింపుపైనా బోర్డు దృష్టి సారించనుంది. చిన్ననీటివనరులు, తాగునీటి లెక్కింపులు, బోర్డు తరలింపు.. అనుమతుల్లేని ప్రాజెక్టులు, బోర్డు నిర్వహణపైనా చర్చిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పరస్పర ఫిర్యాదులపైనా చర్చించనున్నారు.

చైర్మన్‌ ఏపీ ప్రభుత్వానికి మద్దతిస్తూ శ్రీశైలం జలాశయంలో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని.. సాగర్, కృష్ణా డెల్టా అవసరాలకు అనుగుణంగానే విద్యుత్‌ ఉత్పత్తి ఉండాలన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్‌ ఉత్పత్తి ఆపేది లేదని తేల్చి చెప్పింది. ఇరిగేషన్‌ లిఫ్ట్‌ పని చేసినప్పుడు మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని బోర్డ్‌ చైర్మన్‌ పేర్కొనగా.. ఈ వ్యాఖ్యలపై నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రజత్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేఆర్‌ఎంబీ చైర్మన్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. సమావేశం ముగిసిన అనంతరం కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం ప్రారంభమైంది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ బోర్డుల చైర్మన్ల ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశం కొనసాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement