Thursday, September 12, 2024

Telangana – వైర‌ల్ తో వ‌ణుకుతున్న ప‌ల్లెలు …. విష‌ జ్వ‌రాల‌తో మంచంప‌ట్టిన జనాలు

(ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్) తెలంగాణ అంత‌టా విష‌ జ్వ‌రాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మ‌లేరియా, టైఫాయిడ్‌, చికెన్ గున్యా ఇలా పంజా విసురుతున్నాయి. ప్ర‌తి ప‌ల్లెలోనూ జ్వ‌ర‌పీడితులు మంచాన ప‌డుతున్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో త‌ప్ప మిగిలిన చోట డెంగ్యూ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు లేక‌పోవ‌డంతో ప్లేట్‌లేట్స్ ఆధారంగా వైద్య‌సేవ‌లు అందిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రులు జ్వ‌ర‌పీడితుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. గ‌తం కంటే ఓపీకి వ‌చ్చిన వారి సంఖ్య పెరిగింది. జ్వ‌ర‌మొస్తే వేలాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌ని జ్వ‌ర‌పీడితుల కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

క్షీణించిన పారిశుధ్యం కూడా జ్వ‌రాల విజృంభ‌ణ‌కు ఒక కార‌ణం. ఏ గ్రామంలోనూ పారిశుధ్యం మెరుగుకు చ‌ర్య‌లు చేప‌ట్టే దాఖాలాలు లేవు. ఎక్క‌డిక‌క్క‌డే మురుగు నిలిచిపోయి దోమ‌లు విజృంభిస్తున్నాయి. ఈ దోమ‌ల బెడ‌ద వ‌ల్ల డెంగ్యూ, మ‌లేరియా ప్ర‌బ‌లుతున్నాయి. ప్ర‌తి 45 రోజుల‌కోసారి ఫాగింగ్ ద్వారా దోమ‌ల నివార‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాలి. కానీ ఆఊసే లేదు. మేజ‌ర్ పంచాయ‌తీల్లో సైతం ఫాగింగ్ లేదు, పారిశుధ్య‌మెరుగుకు చ‌ర్య‌లు కాన‌రావడం లేదు. తాగునీటి ప‌థ‌కాలు క్లోరినేష‌న్ చేయ‌డంలో నిర్ల‌క్ష్యం క‌నిపిస్తోంది. ఇక చిన్న పంచాయ‌తీ గురించి వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. జ్వ‌రాల అదుపున‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప‌లు గ్రామాల ప్ర‌జ‌లు కోరుతున్నారు. వాన కాలం సీజ‌న్ కొన‌సాగుతోంది. పారిశుధ్యం మెరుగు, దోమ‌ల నివార‌ణ‌కు చ‌ర్యలు తీసుకోవాల‌ని వారు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అలాగే ప్ర‌తి గ్రామంలోనూ వైద్య శిబిరాలు నిర్వ‌హించాల‌న్నారు.

- Advertisement -

మంచం ప‌ట్టిన సింగ‌రేణి నిర్వాసిత ప్రాంతం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని సింగ‌రేణి నిర్వాసిత గ్రామాల్లో విష‌జ్వ‌రాలు విజృంభించాయి. కొప్పాయి, కోయగూడెం, కిష్టారం, లచ్చగూడెం, బోడు , గంగారం, ఎర్రాయి గూడెం త‌దిత‌ర గ్రామాల్లో జ్వ‌రాల‌తో ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌తి ఇంటా జ్వ‌రపీడితులు మంచాన ప‌ట్టారు. ఖ‌మ్మం జిల్లాలో డెంగ్యూతోపాటు మ‌లేరియా, టైఫాయిడ్‌తో రోగులు మంచాన ప‌డుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 14,452 మంది డెంగ్యూ టెస్ట్ లు నిర్వహించగా 367 వరకు పాజిటివ్ కేసులు వచ్చినట్లు తెలుస్తోంది. జులైలో 109, ఆగ‌స్టులో ఇప్పటి వరకు 67 డెంగ్యూ కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ఓపీ కంటే ఎక్కువ‌గా ఉంటుంది. పారిశుధ్య లోపం కార‌ణంగా జ్వ‌రాలు విజృంభిస్తున్నాయ‌ని ప‌లువురు అన్నారు.

రెండు నెల‌లో 12000 మందికి జ్వ‌రాలు


ఉమ్మ‌డి ఆదిలాబాద్ : వానా కాలం సీజ‌న్‌లో ప‌ల్లె ప‌ట్ట‌ణం తేడా లేకుండా జ్వ‌రాలు విజృంభిస్తున్నాయి. నెల రోజుల్లో కొమ‌రాం బీం ఆసిఫాబాద్‌లో న‌లుగురు మృత్యువాత ప‌డ్డారు అంటే జ్వ‌రాల తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో 12000 మందికి పైగా జ్వ‌రాల బారిన ప‌డ్డారు. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా డెంగ్యూ ప‌డ‌గ విప్పింది. ఆదిలాబాద్, నిర్మ‌ల్‌, మంచిర్యాల‌, కొమ‌రాం భీం ఆసిఫాబాద్ జిల్లాలో డెంగ్యూ, విష జ్వ‌రాలు, డ‌యేరియా, చికున్‌గున్య‌,టైఫాయిడ్ జ్వ‌రాలు ప్ర‌బ‌లుతున్నాయి. ఉమ్మ‌డి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు నెల‌ల్లో 225 డెంగ్యూ కేసులు న‌మోద‌య్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 62 , నిర్మ‌ల్‌లో 73, కొమ‌రాం భీం ఆసిఫాబాద్‌లో 46, మంచిర్యాల‌లో 43 డెంగ్యూ కేసులను వైద్యాధికారులు గుర్తించారు. ప్రైవేటు ఆస్ప‌త్రిలో స‌రైన నిర్థార‌ణ కేంద్రాలు లేక ప్లేట్‌లేట్ సంఖ్య‌ను బ‌ట్టీ నిర్ధారిస్తూ వైద్య‌సేవలు అందిస్తున్నారు. క్షీణించిన పారిశుధ్యం, దోమ‌ల బెడ‌ద వ‌ల్లే జ్వ‌రాలు విజృంభిస్తున్నాయ‌ని ఆ జిల్లా క‌లెక్ట‌ర్ గుర్తించారు. నారునూరు, ఖండాల గ్రామాల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ అక్క‌డ పారిశుధ్యం అధ్వానంగా ఉంద‌ని గుర్తించి ఇద్ద‌రు పంచాయ‌తీ ఉద్యోగుల‌ను స‌స్పెన్ష‌న్ చేశారు. గ్రామాల్లో క‌నీసం బ్లీచింగ్ వేయ‌డం లేద‌ని, అలాగే తాగునీటి ట్యాంకుల‌ను క్లోరినేష‌న్ చేయ‌డం లేద‌ని ప‌లు గ్రామాల ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్నారు.

వైరల్ జ్వ‌రాలే అధికం

నిజామాబాద్, : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పల్లెలు, పట్టణాలు జ్వరాలతో వణికిపోతున్నాయి. ప్రతి గ్రామంలో జ్వరాలతో బాధ‌ప‌డుతున్న‌వారు ఉన్నారు. వైర‌ల్ జ్వ‌రాలు అధికంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోనే 300లకు పైగా డెంగ్యూ సోకిన‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి. ప్ర‌తి ఆస్ప‌త్రి రోగులతో కిట‌కిట‌లాడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైద్యం కోసం ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో సరైన సౌకర్యాలు లేక, బెడ్స్ సరిపోక ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను రోగులు ఆశ్ర‌యిస్తున్నారు. శ్వాస కోస వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు కూడా అధికంగా ఉన్నారు. డెంగ్యూ, వైరల్ జ్వరాలు, ఊపిరితిత్తుల సమస్యలతో విపరీతమైన కేసులు నమోదు అవుతున్నాయి.

మూడు వేల మందికి జ్వ‌రాలు
క‌రీంన‌గ‌ర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెంగ్యూ, టైఫాయిడ్ తోపాటు జ్వ‌రాలు ప్ర‌బ‌లుతున్నాయి. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. డెంగ్యూతోపాటు వైరల్ ఫీవర్ లక్షణాలు కూడా ఒకేలా ఉండడంతో సాధారణ జ్వరం అయినా ప్రజల్లో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూ కారణంగా చాలా మందిలో ప్లేట్లెట్లు ప‌డిపోవ‌డంతో ప‌ల్లె ప్ర‌జ‌లు న‌గ‌రాల్లో ఉన్న ఆస్ప‌త్రుల వైపు ప‌రుగులు తీస్తున్నారు. దీంతో జిల్లా కేంద్ర ఆస్ప‌త్రితోపాటు ప్రైవేటు ఆస్ప‌త్రులు కూడా కిట‌కిట‌లాడుతున్నాయి. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో సుమారు మూడు వేల మంది వ‌ర‌కు జ్వ‌రాల బారిన ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఈ మూడు నెల‌లో కరీంనగర్ జిల్లాలో 1213, జగిత్యాల జిల్లాలో 816, పెద్దపల్లి జిల్లాలో 480, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 396 మంది వివిధ జ్వరాల భారిన పడినట్లు అధికారులు చెబుతున్న లెక్క‌లు. జ్వ‌రాల అదుపున‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు. రెండు నెల‌ల్లో రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో డెంగ్యూ 15.. మ‌లేరియా 2 కేసులు న‌మోద‌య్యాయి.

ఫీవ‌ర్‌.. ఫీవ‌ర్‌…

జ‌యశంక‌ర్ భూపాలపల్లి : జిల్లా లో వైరల్ ఫీవర్ వ‌ణికిస్తోంది. ఎక్క‌డ చూసిన ఫీవ‌ర్ అంటే ఫీవ‌ర్ అనే మాట వినిపిస్తోంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రధాన ఆస్పత్రి, చిట్యాల, మహాదేవపూర్ సామాజిక ఆస్పత్రులు, ఘనపురం, చెల్పూర్ కాటారం మహాముత్తారం భూపాలపల్లి రేగొండ వెలిశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోజు రోజుకు ఓపీల సంఖ్య పెరుగుతుంది. జులైలోని టేకుమట్ల మండలంలో ఒక డెంగ్యూ కేసు నమోదు కాగా ఆగస్టు నెలలో గడిచిన 16 రోజులలో జిల్లా వ్యాప్తంగా నాలుగు డెంగ్యూ, రెండు మలేరియా కేసులు నమోదైననట్లు భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్ తెలిపారు. తాడిచెర్ల 1, రేగొండ 1, భూపాలపల్లి 1, చిట్యాల 1 డెంగ్యూ కేసులు నమోదు కాగా మహాముత్తారంలో 1, మహాదేవపూర్ లో 1 మలేరియా కేసులు నమోదు అయినట్టు చెప్పారు.

యాదాద్రి లో డెంగ్యూ పంజా
యాదాద్రి భువ‌న‌గిరి : జిల్లాలో రోజు రోజుకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌, చికెన్ గున్యా, ఫైలేరియా, మలేరియా వ్యాధులు చుట్టూముడుతున్నాయి.. యాదాద్రిలో జిల్లా ఆసుపత్రి తో పాటు, ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రులు, 21 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటికి రోగుల తాకిడి అధికంగా ఉంది. గత రెండు నెలల్లో జిల్లాలో 37 డెంగ్యూ కేసులు నమోదు కాగా 34 కేసులు రికవరీ అయ్యాయి. చికెన్ గున్యా ఒక్క కేసు నమోదు అయ్యాయి. కొంద‌రు ప్రైవేటు ఆస్ప‌త్రుల‌నుఆశ్ర‌యిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement